వైశ్యుల దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాం.. చంద్రబాబుకి వార్నింగ్
ఏపీలో ఆర్యవైశ్యుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని, ఎక్కడైనా కిరాణా షాపులో గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఘటనలు రాష్ట్ర చరిత్రలో ఉన్నాయా అని వారు ప్రశ్నించారు.
చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడాయన మెడకు చుట్టుకుంటున్నాయి. కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారంటూ చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయడాన్ని వైశ్యులు, వర్తకులు తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం రావులపాలెంకు మాత్రమే పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైశ్యులు ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తారని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్త ఆందోళన..
కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారంటూ రావులపాలెం సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మొదట్లో రావులపాలెం వర్తకులు ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఒకరోజు బంద్ పాటించారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులు ఏకమయ్యారు. ఇతర వర్గాల్లో కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఖండించింది. రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్ నేతలు చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.
ఏపీలో ఆర్యవైశ్యుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని, ఎక్కడైనా కిరాణా షాపులో గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఘటనలు రాష్ట్ర చరిత్రలో ఉన్నాయా అని వారు ప్రశ్నించారు. ఎక్కడో గంజాయి దొరికితే దాన్ని వ్యాపారులకు ఆపాదించడం సరికాదన్నారు. ఆర్యవైశ్యులను అవమానించడం బాబుకు అలవాటుగా మారిందని, ఉద్దేశపూర్వకంగానే విమర్శలు చేశారని మండిపడ్డారు. అటు కడపలో కూడా నిరసనలు మొదలయ్యాయి. వెంటనే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, లేదంటే ఆర్యవైశ్యుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు ఆ సంఘం నేతలు. ఎన్నికల్లో ఓటు రూపంలో తమ సమాధానం చెబుతామని వారు హెచ్చరించారు.