ఇక ఏపీ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు
విద్యాశాఖ అధికారులు, యూనివర్సిటీ వైస్ చాన్సలర్లతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో ఆయా అంశాలపై సీఎం తన ఆలోచనలు సుదీర్ఘంగా వివరించారు
ఏపీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చే దిశగా సీఎం వైఎస్ జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. గురువారం విద్యాశాఖ అధికారులు, యూనివర్సిటీ వైస్ చాన్సలర్లతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో ఆయా అంశాలపై సీఎం తన ఆలోచనలు సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
- రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఏపీ విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు తేవాలి. విద్యా వ్యవస్థలో ఏఐని భాగం చేయాలి.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మన విద్యార్థులు క్రియేటర్లుగా మారాలి.
- వైద్య విద్యలో రోబోటిక్స్, ఏఐలను పాఠ్యప్రణాళికలో, బోధనలో భాగస్వామ్యం చేయాలి.
- ప్రశ్నపత్రాల విధానం మారాలి. వెస్ట్రన్ వరల్డ్ స్థాయిలో ఉండాలి.
- ప్రాథమిక విద్యా వ్యవస్థ నుంచే ఈ మార్పులు జరిగేలా ప్రణాళికలు ఉండాలి.
- వీటి కోసం హైలెవెల్ అకడమిక్ బోర్డు అవసరం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులతో బోర్డును ఏర్పాటు చేయాలి.
- పాఠశాల విద్యా స్థాయిలో ఒక బోర్డు, ఉన్నత విద్యా స్థాయిలో మరో బోర్డు ఉండాలి.
- అత్యుత్తమ పాఠ్యప్రణాళిక, అత్యుత్తమ బోధనా పద్ధతులను ఖరారు చేయాలి.
- శిక్షణ ఇవ్వడం ద్వారా అత్యుత్తమ బోధకులకు సిద్ధం చేయాలి.