ఆరోగ్య శ్రీ విషయంలో ఆ అనుమానమే నిజమవుతోంది
బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీ నిర్వహణ బదిలీ చేస్తే అత్యవస సేవలకోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే రోగులు ఇబ్బంది పడతారనే అనుమానాలున్నాయి.
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25లక్షలకు పెంచింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వీలయితే పరిమితి పెంచాలి, లేదా జాబితాలోని రోగాల సంఖ్యను పెంచాలి. కానీ ఆరోగ్యశ్రీని బీమా సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు బీమా కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు మొదలుపెట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 100రోజులు పూర్తయ్యేనాటికి బీమా విధానంపై ముసాయిదా రూపొందిస్తారని తెలుస్తోంది.
ఎందుకీ మార్పు..?
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ బిల్లుల్ని ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వమే చెల్లిస్తోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు బకాయిలు పేరుకుపోవడం, నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో చీటికీ మాటికీ ప్రైవేటు ఆస్పత్రులు గొడవ చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామంటూ బెదిరించి మరీ బకాయిలు రాబట్టుకుంటున్నాయి. ఇకపై ఈ ఒత్తిడి లేకుండా ఆ భారం ఆరోగ్యబీమా కంపెనీలపై వేసేందుకు కొత్త ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. దీనివల్ల ఆరోగ్యశ్రీ సేవలు పొందే లబ్ధిదారులకు కొత్తగా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. రాగా పోగా బీమా కంపెనీల దయాదాక్షిణ్యాలపై మాత్రమే వైద్య సేవలు పొందే అవకాశముంది.
ప్రస్తుతం పలు ప్రైవేట్ బీమా కంపెనీలు ఆరోగ్య బీమా అందిస్తున్నాయి. అయితే వాటిలో కొర్రీలు అధికం. వీలైనంత మేర లబ్ధిదారులకు మేలు జరగకూడదనే ఆ కంపెనీలు ఆలోచిస్తుంటాయి. అంటే తమ లాభమే వారికి ముఖ్యం. కానీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సేవలు లాభాపేక్షతో చేపట్టేవి కావు. బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీ నిర్వహణ బదిలీ చేస్తే అత్యవస సేవలకోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే రోగులు ఇబ్బంది పడతారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. కూటమి ప్రభుత్వం మాత్రం గతంలో కూడా ఇదే విధానం అమలులో ఉందని చెబుతూ బీమా కంపెనీలవైపే మొగ్గు చూపుతోంది.