Telugu Global
Andhra Pradesh

ఆమంచి ఉద్దేశం అది కాదు

ఆమంచి కృష్ణమోహన్ తరఫున కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి సీబీఐ తీరును తప్పుపట్టారు.

ఆమంచి ఉద్దేశం అది కాదు
X

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ న్యాయస్థానాలను, జడ్జిలను కించపరిచారంటూ నమోదైన కేసులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. గతంలో డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేయగా ఆ సమయంలో ఆమంచి కృష్ణమోహన్ కోర్టు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి చిన్న చిన్న కేసులు కూడా సీబీఐకి అప్పగిస్తే న్యాయస్థానాలపై ప్రజల్లో నమ్మకం సడలుతుందన్నారు. కోవిడ్ ఉందని లేకుంటే తాను కోర్టు వద్ద ధర్నా కూడా చేసేవాడినని ఆ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదైంది. ఆమంచి కృష్ణమోహన్ తరఫున కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి సీబీఐ తీరును తప్పుపట్టారు.

కోర్టు ఒకటి చెబితే సీబీఐ మరొకటి చేస్తోందని ఆక్షేపించారు. న్యాయవ్యవస్థపై వ్యాఖ్యల్లో కుట్రకోణం ఉందో లేదో తేల్చమని మాత్రమే కోర్టు చెప్పిందని, కానీ సీబీఐ దర్యాప్తు మాత్రం మరో విధంగా ఉందని అభ్యంతరం తెలిపారు. హైకోర్టు ఆదేశాల స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలో సీబీఐ విఫలమైందని వ్యాఖ్యానించారు. కేవలం హైకోర్టు రిజిస్ట్రీ ఎవరి వివరాలు ఇస్తే వారందరి పైన గుడ్డిగా కేసులు నమోదు చేస్తూ సీబీఐ వెళ్తుందని, ఆమంచిపై కేసు కూడా ఇదే తరహాలో నమోదయిందన్నారు. దర్యాప్తు పూర్తి చేయకుండానే ఆమంచి వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందంటూ సీబీఐ చెబుతోందని ఇది సరైన విధానం కాదని న్యాయవాది వాదించారు.

డా. సుధాకర్ లాంటి కేసును సీబీఐకి అప్పగించడం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలుతుంది అని మాత్రమే అన్నారని, ఆమంచి ఎక్కడా కూడా న్యాయస్థానాలను, హైకోర్టును కించపరచలేదని వివరించారు. కోర్టులకు దురుద్దేశాలు ఆపాదించకుండా సద్విమర్శ చేస్తే తప్పేమీ కాదంటూ గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పిందని న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు గుర్తు చేశారు.

సోషల్ మీడియాలో పోస్టులపై హైకోర్టు ఇప్పటికే కోర్టు ధిక్కరణ కింద చర్యలు ప్రారంభించిందని కాబట్టి ఇప్పుడు క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. గతంలో ఆమంచి కృష్ణమోహన్ ను ఒక సాక్షిగా పిలిచిన సీబీఐ ఇప్పుడు ఆయనను ఏకంగా నిందితుడిగా చేసిందని, ఈనెల 20న‌ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు కూడా ఇచ్చిందని, కస్టడీలోనికి తీసుకొని విచారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆమంచి తరపు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు.

ఏ రకంగా చూసినా ఈ కేసులు, ఈ సెక్షన్లు చెల్లుబాటు కావని కాబట్టి ఆమంచిపై కేసు కొట్టివేయాలని హైకోర్టుకు విన్నవించుకున్నారు. పిటిషనర్ ఆమంచి కృష్ణమోహన్ దేశం విడిచిపోరని.. ఈ నెల 20న సీబీఐ ముందు హాజరవుతారని, అరెస్టుతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని హైకోర్టును కోరారు . అయితే తమ వాదనలను ఈ నెల 29న విన్నవిస్తామని కోర్టుకు సీబీఐ తెలిపింది. సీబీఐ ఎదుట ఆమంచి కృష్ణమోహన్ హాజరు తేదీని రీ షెడ్యూల్ చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలను పరిగణలోనికి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది. జస్టిస్ ఎన్. జయ సూర్య ఈ కేసును విచారిస్తున్నారు.

First Published:  16 July 2022 3:34 AM GMT
Next Story