Telugu Global
Andhra Pradesh

ప్రత్యేక హోదా దక్కాలంటే మూడే మార్గాలా?

ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రంలో రాజకీయ నినాదంగా మారిపోయింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా దక్కకపోవటానికి మీరు కారణమంటే కాదు మీరే కారణమని టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై మరొక‌రు ఆరోపణలు చేసుకుంటున్నారు.

ప్రత్యేక హోదా దక్కాలంటే మూడే మార్గాలా?
X

రాష్ట్ర విభజన నేపథ్యంలో న్యాయబద్ధంగా ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌ను నరేంద్రమోడీ సర్కార్ కంపు చేసేసింది. 2014 ఎన్నికల ప్రచారంలో పై రెండింటిని ఇస్తామని జనాలను నమ్మించి ఓట్లేయించుకుని అధికారంలోకి రాగానే మోడీ తుంగలో తొక్కేశారు. మోడీ ప్రధానిగా ఉన్నంతవరకు ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదు. సజావుగా వచ్చేయాల్సిన ప్రత్యేక హోదా చివరకు బీజేపీ రాజకీయాల కారణంగా రాజకీయ డిమాండ్‌గా మారిపోయింది.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సోమవారం రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి బలంగా వినిపించారు. ఎవరెంత బలంగా వినిపించినా రాష్ట్రానికి హోదా దక్కదని అందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడుతో ప్రత్యేక హోదా అవసరంలేదు ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందని మోడీయే చెప్పించారు. రావాల్సిన హోదా దక్కకపోగా ప్రకటించిన ప్యాకేజీని కూడా ఇవ్వలేదు. అన్నీ విధాలుగా కేంద్రం ఏపీని మోసం చేసిందన్న మంటతోనే జనాలు బీజేపీకి డిపాజిట్లు కూడా రానీయటంలేదు.

ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రంలో రాజకీయ నినాదంగా మారిపోయింది. హోదా దక్కకపోవటానికి మీరు కారణమంటే కాదు మీరే కారణమని టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై మరొక‌రు ఆరోపణలు చేసుకుంటున్నారు. మధ్యలో హోదా అనేది ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు ప్రకటించేశారు. అలాంటిది తాజాగా బీజేపీ చీఫ్ సోమువీర్రాజు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని చెప్పారు.

వీర్రాజు తాజా ప్రకటన చూసిన తర్వాత ఏదో వ్యూహం మొదలైనట్లే అనుమానంగా ఉంది. రాష్ట్రానికి హోదా దక్కాలంటే మూడు మార్గాలున్నాయి. మొదటి ప్రధానమంత్రిగా మోడీ స్థానంలో ఇంకెవరైనా రావాలి. రెండో మార్గం ఏమిటంటే 2024లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏపీ ఎంపీల మద్దతు తప్పనిసరవ్వాలి. ఇక మూడో మార్గం ఏమిటంటే ఎన్డీయే దిగిపోయి యూపీఏ అధికారంలోకి రావాలి. మూడో మార్గానికి అవకాశం తక్కువ‌నే అనిపిస్తోంది. కాబట్టి మొదటి రెండు మార్గాల్లో ఏదోకటి జరిగితే కానీ ఏపీకి హోదా దక్కదంతే.

First Published:  8 Feb 2023 6:31 AM GMT
Next Story