పవన్ పాటించే విలువలివేనా..?
ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయించకుండానే టీడీపీలోకి వైసీపీ నేతలను చేర్చుకోవటాన్ని విమర్శించిన పవన్ ఇప్పుడు తాను అదే పనిచేశారు.
ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారనే సామెత జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సరిగ్గా సరిపోతుంది. వైసీపీలో నుంచి వచ్చిన వంశీకృష్ణ యాదవ్ ను చేర్చుకునే విషయంలోనే పవన్ పాటించే విలువలు ఏమిటో అందరికీ అర్థమైపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ రెండు రోజుల క్రితమే జనసేనలో చేరారు. పవనే స్వయంగా వంశీకి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వంశీని పార్టీలో చేర్చుకోవటంలో ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరంలేదు.
అయితే వైసీపీలో నుంచి జనసేనలో చేరేముందు పార్టీ తనకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటం కనీస ధర్మం. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే పవన్ వంశీని జనసేనలో చేర్చుకునుంటే బాగుండేది. ఎందుకంటే.. ఒకప్పుడు అంటే టీడీపీతో పవన్ కు విరోధం ఉన్న కాలంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను చంద్రబాబు పార్టీలో చేర్చుకున్న విషయమై తప్పుపట్టిన విషయం తెలిసిందే. 2014లో వైసీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయించకుండానే టీడీపీలోకి వైసీపీ నేతలను చేర్చుకోవటాన్ని విమర్శించిన పవన్ ఇప్పుడు తాను అదే పనిచేశారు. అంటే విలువలు అన్నది చెప్పటానికే కానీ, పాటించటానికి కాదని పవన్ నిరూపించారు. అందుకనే చంద్రబాబుతో సావాసం చేయగానే పవన్ కు కూడా అవే బుద్ధులు వచ్చేసినట్లున్నాయి. మైకు దొరికితే చాలు వేదికల మీదనుండి పవన్ ఎన్ని విలువలు ప్రవచిస్తారో అందరు వింటున్నదే. కానీ తాను మాత్రం అలాంటి విలువలను పాటించరని పవన్ చాటిచెప్పారు. అయినా బీజేపీతో ఎన్డీఏలో పార్టనర్ గా ఉంటూనే ఎలాంటి సంబంధంలేని టీడీపీతో పవన్ పొత్తుపెట్టుకున్నారు.
ఈ విషయంలోనే పవన్ కు విలువలు లేవని నిరూపణయ్యింది. చంద్రబాబుతో చేతులు కలిపితే కలపచ్చుకానీ, ముందుగా ఎన్టీఏలో నుండి బయటకు వచ్చేసి, బీజేపీతో తెగతెంపులు చేసుకోవాల్సింది. అలా చేయకుండానే ఒకవైపు బీజేపీతో పొత్తులో ఉంటూనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పవన్ నుండి విలువలు ఆశించటం కూడా దండగేనా..?