Telugu Global
Andhra Pradesh

కాపుల్లో చీలికలు రోడ్డెక్కుతున్నాయా?

వ్యక్తిగతంగా తమకు దక్కుతున్న ప్రాధాన్యత ప్రాతిపదికనే కాపు ప్రముఖులు వివిధ పార్టీలో ఉన్నారు. అయితే జోగయ్య మాత్రం కాపులందరినీ జనసేనకు మద్దతుదారులుగా మారాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు జోగయ్య రాసిన లేఖ సంచలనంగా మారింది.

కాపుల్లో చీలికలు రోడ్డెక్కుతున్నాయా?
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్రంగా కాపుల్లో చీలికలు బయటపడుతున్నాయా? క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. పవన్ స్వయంగా కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావటం చీలికలు బయటపడటానికి దోహదం చేస్తున్నాయి. చేగొండి హరిరామజోగయ్య మొదటి నుండి పవన్‌కు బలమైన మద్దతుదారుడిగా ఉన్న విషయం తెలిసిందే. అటు పవన్‌ను ఇటు జోగయ్యను వ్యతిరేకిస్తున్న కాపులు ఇద్దరినీ పెద్దగా పట్టించుకోవటంలేదు.

ఇక్కడ విషయం ఏమిటంటే కాపుల్లో చాలా చీలికలున్నాయి. కాపుల్లో చాలామంది నేతలు తమ ఇష్టంవచ్చిన పార్టీల్లో ఉన్నారు. వ్యక్తిగతంగా తమకు దక్కుతున్న ప్రాధాన్యత ప్రాతిపదికనే కాపు ప్రముఖులు వివిధ పార్టీలో ఉన్నారు. అయితే జోగయ్య మాత్రం కాపులందరినీ జనసేనకు మద్దతుదారులుగా మారాలని పదేపదే విజ్ఞప్తిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు జోగయ్య రాసిన లేఖ సంచలనంగా మారింది. అందులో గుడివాడను ఉద్దేశించి మంత్రి పదవి కోసం అమ్ముడుపోయావని, నువ్వు బచ్చావంటు జోగయ్య ఘాటైన పదాలు వాడారు.

దాంతో మంత్రి కూడా జోగయ్యకు రిప్లై ఇచ్చారు. అమ్ముడుపోవటం, బచ్చా అనే పదాలను ప్రస్తావిస్తూ పవన్‌కు రాయాల్సిన లేఖను పొరబాటున తనకు రాశారేమో అని చురకలంటించారు. ఈ సమయంలోనే వీళ్ళ మధ్యలోకి కాపునాడు మేధావుల విభాగం దూరింది. జోగయ్యకు విభాగం కన్వీనర్ గనిశెట్టి వెంకట శ్రీరామచంద్రమూర్తి ఓ సలహా ఇచ్చారు. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో పాలకొల్లులో పవన్‌ను పోటీ చేయించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తమ చాతుర్యంతో, రాజనీతిని ఉపయోగించి పవన్‌ను గెలిపిస్తే సంతోషమని జోగయ్యకు చురకలంటించారు.

ఇక్కడ విషయం ఏమిటంటే కాపుల్లోనే పాలకొల్లు కాపులని, కాకినాడ కాపులని రకరకాల చీలికలున్నాయి. పవన్, జోగయ్యకు మద్దతిచ్చే కాపుల్లో చాలామందికి ముద్రగడ మద్దతుదారులతో పడదు. జోగయ్య పుణ్యమాని కాపుల్లోని ఈ చీలికలన్నీ ఇప్పుడు రోడ్డెక్కుతున్నాయి. ఈ చీలికల వల్లే అప్పట్లో పాలకొల్లులో చిరంజీవి ఓడిపోయింది. పాలకొల్లు అంటే జోగయ్య నియోజకవర్గం. అందుకనే పవన్‌ను పాలకొల్లులో పోటీ చేయించి గెలిపించమని గనిశెట్టి ఎద్దేవా చేసింది. ఈ నేప‌థ్యంలో కాపుల ఓట్లు జనసేనకు ఏ మేరకు పడతాయో అనుమానమే.

First Published:  6 Feb 2023 11:07 AM IST
Next Story