ముద్రగడను ఇంత తక్కువగా అంచనా వేస్తున్నారా..?
జనసేనలో కొత్త ప్రచారం మొదలైంది. అదేమిటంటే ద్వారంపూడిని ఓడించాలంటే పవన్ కన్నా ముద్రగడే కరెక్టు అభ్యర్థిగా చంద్రబాబు సూచించారట.
రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సేఫ్ సీటును చూసుకుంటున్నారా..? టీడీపీ-జనసేన కూటమిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. కూటమి తరఫున ముద్రగడ పద్మనాభంను పోటీలోకి దింపాలని చంద్రబాబునాయుడు స్వయంగా పవన్ కు సూచించారట. ముద్రగడ పోటీచేస్తేనే వైసీపీని ఓడించగలమని చెప్పారట. అందుకు పవన్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు విషయం ఏమిటంటే.. రాబోయే ఎన్నికల్లో పవన్ ఎక్కడినుండి పోటీచేస్తారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. జనాల రెస్పాన్స్ చూడటం కోసం పదేపదే అనేక నియోజకవర్గాల పేర్లను లీకుల రూపంలో వదులుతున్నారు. ఒకసారి తిరుపతి, మరోసారి కాకినాడ, ఇంకోసారి భీమవరం, గాజువాకని రకరకాల పేర్లను పార్టీయే ప్రచారంలోకి తెస్తోంది. మధ్యలో పిఠాపురం, భీమిలి, విశాఖ ఉత్తర నియోజకర్గాల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. చివరకు ఈమధ్యనే కాకినాడ జిల్లాపై సమీక్ష చేశారు. ఆ సందర్భంగా పవన్ ఆసక్తిని గమనించిన నేతలు కాకినాడ సిటీ నియోజకవర్గంలో పోటీచేయటం ఖాయమని అనుకున్నారు.
ఎందుకంటే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఉన్నారు. ద్వారంపూడి-పవన్ కు ఏమాత్రం పడదు. ఇద్దరు వ్యక్తిగతంగానే ఒకళ్ళని మరొకళ్ళు బాగా తిట్టేసుకున్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో ద్వారంపూడి ఎలా గెలుస్తారో చూస్తానని పవన్ ఛాలెంజ్ చేశారు. కాబట్టి రాబోయే ద్వారంపూడి మీద పవనే పోటీచేస్తారనే ప్రచారం బాగా పెరిగిపోయింది. దానికి అనుగుణంగానే కాకినాడ సమీక్షలో కాకినాడ సిటీ నియోజకవర్గంపై పవన్ బాగా ఆసక్తి చూపించటంతో కాకినాడ సిటీ నియోజకవర్గంలో పోటీ బాగా టఫ్ ఫైట్ తప్పదని అనుకున్నారు.
అయితే తాజా పరిణామాలు ఏమిటంటే.. జనసేనలో కొత్త ప్రచారం మొదలైంది. అదేమిటంటే ద్వారంపూడిని ఓడించాలంటే పవన్ కన్నా ముద్రగడే కరెక్టు అభ్యర్థిగా చంద్రబాబు సూచించారట. ఎందుకంటే ద్వారంపూడి-ముద్రగడ మధ్య మంచి సంబంధాలున్నాయి. కాబట్టి ద్వారంపూడి మీద ముద్రగడ పోటీచేస్తేనే కాపుల ఓట్లన్నీ వన్ సైడ్ గా కూటమికి పడతాయని చంద్రబాబు చెప్పారట. అందుకనే సడన్ గా కాకినాడ సిటీ నియోజకవర్గం నుండి ద్వారంపూడి మీద ముద్రగడ పోటీచేయబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. జనసేనలో చేరబోతున్న ముద్రగడ ఎక్కడ పోటీచేయాలో చంద్రబాబు సూచించటమే విచిత్రంగా ఉంది.