Telugu Global
Andhra Pradesh

ల‌బ్ధిదారులే ప్రచారకర్తలా?

ల‌బ్ధిదారులు గనుక తనకు అనుకూలంగా ప్రచారం చేస్తే చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా తన గెలుపును అడ్డుకోలేరని జగన్ గట్టిగా అనుకుంటున్నారు. మరి జగన్ అనుకుంటున్నట్లు ల‌బ్ధిదారులు ప్రచారకర్తలవుతారా?

ల‌బ్ధిదారులే ప్రచారకర్తలా?
X

వచ్చే ఎన్నికల్లో అధికార-ప్రతిపక్షాల మధ్య పోటీ మహా భీకరంగా ఉండబోతోంది. మామూలుగా భీకరం అనే పదాన్ని యుద్ధాల్లో ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఎన్నికలు అందులోను వైసీపీ, టీడీపీ మధ్య జరిగేది కూడా యుద్ధం లాంటిది కాబట్టే భీకరమన్నది. ఈ యుద్ధంలో పార్టీలు, అభ్యర్థుల‌ బలాబలాలు ఎలాగున్నా ప్రచారం చాలా కీలకపాత్ర పోషించబోతోంది. ప్రచారమంటే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ మాట్లాడేది కాదు. ఎల్లో మీడియా జగన్‌కు వ్యతిరేకంగా చేసేది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికలు చంద్రబాబు, పవన్‌కు ఎంతటి కీలకమో ఎల్లో మీడియాకు అంతకన్నా కీలకం. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డే మళ్ళీ గెలిస్తే చంద్రబాబు, పవన్ హైదరాబాద్‌లోనే ఎక్కువ కాలం గడిపేస్తారు. ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో తమ్ముళ్ళతో సమీక్షలు జరుపుతు చంద్రబాబు, సినిమా షూటింగుల బిజిలో పవన్ ఉంటారు. కానీ ఎల్లో మీడియా పరిస్థితి అలాకాదు. అందుకనే జగన్‌ను ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు, పవన్ కన్నా ఎల్లో మీడియానే ఎక్కువ పాత్ర పోషిస్తోంది.

ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే జగన్‌కు వ్యతిరేకంగా ఈ మీడియా ఇంతగా రెచ్చిపోతోందంటే ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తే పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతుందేమో. ఈ సంగతి సరే మరి జగన్ పరిస్థితి ఏమిటి? జగన్ సొంత మీడియా వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ నేపథ్యంలోనే జగన్ ఆశలు పెట్టుకున్నది రెండు విషయాల మీదనే. మొదటిది సోషల్ మీడియా, రెండోది లబ్ధిదారులు.

ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధిపొందిన వాళ్ళే తన ప్రచారకర్తలుగా పనిచేయాలని జగన్ కోరుకుంటున్నారు. అందుకనే ప్రభుత్వం వల్ల లబ్ధి జరిగిందని అనుకుంటేనే వైసీపీకి ఓట్లేయమని చెబుతుంది. ప్రభుత్వం నుండి చాలా కుటుంబాలకు ఏదోరూపంలో ఏదోక లబ్ధి అందే ఉంటుందని ఒక అంచనా. తమకు అందిన లబ్ధిని ల‌బ్ధిదారులు మరో పదిమందికి చెప్పాలని జగన్ కోరుకుంటున్నారు. జగన్ ప్లాన్ గనుక వర్కవుటైతే లబ్ధిదారులే ప్రచారకర్తలవుతారనటంలో సందేహంలేదు. కాబట్టి ల‌బ్ధిదారులు గనుక తనకు అనుకూలంగా ప్రచారం చేస్తే చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా తన గెలుపును అడ్డుకోలేరని జగన్ గట్టిగా అనుకుంటున్నారు. మరి జగన్ అనుకుంటున్నట్లు ల‌బ్ధిదారులు ప్రచారకర్తలవుతారా?

First Published:  2 April 2023 12:21 PM IST
Next Story