Telugu Global
Andhra Pradesh

గన్‌తో కాల్చుకుని ఏఆర్‌ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. - ఎస్పీ కార్యాలయం వద్ద ఘటన

ఆత్మహత్యకు పాల్పడిన ఏఆర్‌ మహిళా కానిస్టేబుల్‌ వేదవతి (28) స్వస్థలం చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని బింగానిపల్లె. ఆమెకు మదనపల్లెకు చెందిన దస్తగిరితో ఏడేళ్ల కిందట వివాహమైంది.

గన్‌తో కాల్చుకుని ఏఆర్‌ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. - ఎస్పీ కార్యాలయం వద్ద ఘటన
X

ఏఆర్‌ మహిళా కానిస్టేబుల్‌ విధి నిర్వహణలో ఉండగానే గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఎస్పీ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న గార్డు డ్యూటీ గదిలోనే ఆమె తన గన్‌తో కాల్చుకుని మృతిచెందారు. గది నుంచి పెద్ద శబ్దం రావడంతో కార్యాలయంలో ఉన్న పోలీసులు, సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు.

ఆత్మహత్యకు పాల్పడిన ఏఆర్‌ మహిళా కానిస్టేబుల్‌ వేదవతి (28) స్వస్థలం చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని బింగానిపల్లె. ఆమెకు మదనపల్లెకు చెందిన దస్తగిరితో ఏడేళ్ల కిందట వివాహమైంది. వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. దస్తగిరి పుంగనూరులోని ప్రైవేటు కోచింగ్‌ సెంటర్‌లో ఫ్యాకల్టీగా చేస్తున్నారు. వేదవతి చిత్తూరు జిల్లా నుంచి ఏడాది కిందట బదిలీపై వచ్చారు. రాయచోటిలోనే వీరు కాపురం ఉంటున్నారు. దస్తగిరికి వేదవతి రెండో భార్య అని పోలీసులు చెబుతున్నారు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో వేదవతి సెల్‌ఫోన్‌లో మాట్లాడారని, ఆ సమయంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై వెంటనే పోలీసులు ఆమె భర్త దస్తగిరికి సమాచారం అందించారు. వెంటనే అతను అక్కడికి చేరుకున్నాడు. రాయచోటి పట్టణ సీఐ సుధాకర్‌రెడ్డి సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దస్తగిరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కానిస్టేబుల్‌ వేదవతి ఆత్మహత్యపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ రామచంద్రరావు, సీఐ సుధాకర్‌రెడ్డి వివరించారు.

First Published:  3 Jun 2024 9:18 AM IST
Next Story