Telugu Global
Andhra Pradesh

రామోజీ నిజాయితీపరుడనుకున్నా..

రామోజీరావు ఒక పొలిటికల్‌ బ్రోకర్‌ అని, పిచ్చిగా అసత్య కథనాలు రాస్తున్నాడని పోసాని ధ్వజమెత్తారు. విద్యార్థులు చదువుకోవడానికి ట్యాబ్‌లు ఇస్తే వాటిలో చెడు వీడియోలు చూస్తున్నారని తన పత్రికలో కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు.

రామోజీ నిజాయితీపరుడనుకున్నా..
X

ఈనాడు సంస్థ అధిపతి రామోజీరావు నిజాయితీపరుడని అనుకునేవాడినని, కానీ ఆయన పేదల డబ్బు దోచుకుతింటున్నాడని ఏపీఎఫ్‌డీసీ చైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి విమర్శించారు. 1985లో సికింద్రాబాద్‌ మార్గదర్శిలో తాను అసిస్టెంట్‌ మేనేజర్‌ పనిచేశానని పోసాని తెలిపారు. రామోజీ చాలా నిజాయతిపరుడని అప్పట్లో అనుకున్నానని చెప్పారు. కానీ, రామోజీ రావు దోపిడీ స్వభావం ఆ తర్వాత అర్థమైందని తెలిపారు. ఒక్కో మార్గదర్శి మేనేజర్‌ నెలకు రూ.10 లక్షలు సంపాదిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అతనో పొలిటికల్‌ బ్రోకర్‌..

రామోజీరావు ఒక పొలిటికల్‌ బ్రోకర్‌ అని, పిచ్చిగా అసత్య కథనాలు రాస్తున్నాడని పోసాని ధ్వజమెత్తారు. విద్యార్థులు చదువుకోవడానికి ట్యాబ్‌లు ఇస్తే వాటిలో చెడు వీడియోలు చూస్తున్నారని తన పత్రికలో కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. ట్యాబ్‌లో కొన్నింటికి మాత్రమే పర్మిషన్‌ ఉంటుందని, ఇతర ఏవీ కూడా ఓపెన్‌ చేయడానికి వీలు లేకుండా లాక్‌ ఉంటుందని చెప్పారు. అవన్నీ పక్కనపెట్టి ప్రజలను తప్పుదారి పట్టించడానికి తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమ్మ వ్యక్తే సీఎంగా ఉండాలనేది రామోజీ కోరిక..

కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండాలనేది రామోజీరావు కోరిక అని పోసాని చెప్పారు. కమ్మవారిలోనూ కేవలం తన చెంచా అయిన చంద్రబాబునే సీఎం కావాలని రామోజీరావు కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ అంటే ఆయనకు ద్వేషమని, ఆయన్ని ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలనే దుర్బుద్ధితో అసత్య కథనాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. రామోజీ రావు కడుపున పుట్టడం శాపమని ఆయన కుమారుడు సుమన్‌ తనతో ఓసారి అన్నాడని, దానిని బట్టి ఆయన బుద్ధి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని పోసాని చెప్పారు.

First Published:  18 Dec 2023 9:41 AM IST
Next Story