Telugu Global
Andhra Pradesh

మంత్రి రోజాపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

షర్మిల కూడా జబర్దస్త్ రోజా అంటూ వెటకారంగా మాట్లాడారు. రోజా ఇంట్లో మొత్తం నలుగురు మంత్రులు ఉన్నారని అన్నారు.

మంత్రి రోజాపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
X

తెలంగాణలో వైఎస్సార్టీపీ తరపున పాదయాత్ర చేసినప్పుడు కూడా అప్పటి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు. ఆ వ్యాఖ్యలతోనే ఆమె హైలైట్ అయ్యేవారు. తన విమర్శలకు ఆయా నాయకులు స్పందిస్తే.. అది షర్మిలకు మరింత పబ్లిసిటీ అయ్యేది. సరిగ్గా ఏపీలో కూడా అలాంటి వ్యూహాన్నే అమలు చేస్తున్నారు షర్మిల. ఇక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఆమె రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వస్తాయో తెలియవు కానీ, వైసీపీ ఎమ్మెల్యేలను మాత్రం ఓడించాలనేది ఆమె వ్యూహం. తాజాగా నగరి నియోజకవర్గంలో పర్యటించిన షర్మిల.. మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జబర్దస్త్ మంత్రి..

ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొన్నా.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రం రోజా ఆ టీవీ షో కి వ్యాఖ్యాతగా వెళ్లడం ఆపేశారు. కానీ టీడీపీ నేతలు మంత్రి రోజాని జబర్దస్త్ పేరుతో కామెంట్ చేయడం మానలేదు. ఇప్పుడు షర్మిల కూడా జబర్దస్త్ రోజా అంటూ వెటకారంగా మాట్లాడారు. రోజా ఇంట్లో మొత్తం నలుగురు మంత్రులు ఉన్నారని అన్నారు. రోజా, ఆమె భర్త సెల్వమణి, ఆమె ఇద్దరు అన్నలు కలిసి యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని అన్నారు షర్మిల. షర్మిల వ్యాఖ్యల్ని ఎల్లో మీడియా హైలైట్ చేయడం ఇక్కడ విశేషం. ఇక్కడ కనీసం కాంగ్రెస్ అభ్యర్థి గురించి షర్మిల పెద్దగా చెప్పలేదు, కేవలం రోజాని టార్గెట్ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమెను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

దివంగత నేత వైఎస్ఆర్ గాలేరు పనులను 90శాతం పూర్తిచేస్తే, జగనన్న కనీసం 10శాతం పనులు కూడా చేయలేదని విమర్శించారు షర్మిల. చేనేత కార్మికులకు 50 శాతం ఉచిత విద్యుత్తు ఇస్తామని, చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని గొప్పలు చెప్పి ఏ పని కూడా చేయలేదని అన్నారు. షర్మిల పర్యటనలు చూస్తే కాంగ్రెస్ కోసం కాకుండా.. కేవలం వైసీపీ ఓటమి కోసం అంటే పరోక్షంగా టీడీపీ కూటమికోసం ఆమె పనిచేస్తున్నారని స్పష్టమవుతోంది.

First Published:  15 April 2024 8:57 AM IST
Next Story