పవన్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు
రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వలంటీర్లే కారణమని, వైఎస్సార్‌సీపీ పాలనలో అదృశ్యమైన 30 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో పవన్‌కు నోటీసులు జారీ చేసింది. వివరాలు తెలిపిన కేంద్ర అధికారి ఎవరో చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. పది రోజుల్లోపు దీనిపై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పవన్‌ను ఆదేశించింది. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
సోమవారం మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కు నోటీసులు ఇచ్చిన విషయం వెల్లడించారు. దీనిపై మహిళా కమిషన్‌కు వలంటీర్ల నుంచి ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని ఆమె తెలిపారు. పవన్ చెబుతున్నట్టుగా తప్పిపోయిన మహిళల వివరాలు ఇవ్వాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డిమాండ్ చేశారు.
ఆదివారం సాయంత్రం ఏలూరులో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వలంటీర్లే కారణమని, వైఎస్సార్‌సీపీ పాలనలో అదృశ్యమైన 30 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. యువత చెడిపోవడానికి పవన్ సినిమాలే కారణమని ఈ సందర్భంగా ఆమె మండిపడ్డారు.