ఇంతటి కక్షపూరిత దాడులు ఎన్నడూ లేవు
కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళలను దాదాపు 24 గంటల పాటు బంధించి కొందరు దుర్మార్గులు చిత్రహింసలకు గురిచేయడం అత్యంత పాశవికమని ఆందోళన వ్యక్తం చేశారు.
తమకు ఓట్లు వేయలేదని.. పల్నాడులో ఎస్సీ, బీసీ మహిళలపై కక్షగట్టి దాడులకు దిగడం దారుణమని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఇంతటి కక్షపూరిత దాడులు ఎన్నడూ లేవని ఆమె మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళలు తమపై టీడీపీ నేతలు చేసిన దాడులపై సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన చైర్‌పర్సన్.. తక్షణం బాధితులకు రక్షణ కల్పించాలని, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు లేఖ రాశారు.
గుడిలోకి వెళ్లి దాక్కోవాల్సిన స్థాయిలో దాడులు..
అనంతరం చైర్‌పర్సన్ వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి భయానక వాతావరణం ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధమని చెప్పారు. కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళలను దాదాపు 24 గంటల పాటు బంధించి కొందరు దుర్మార్గులు చిత్రహింసలకు గురిచేయడం అత్యంత పాశవికమని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు వాళ్లంతా గుడిలోకి వెళ్లి దాక్కున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఓట్లేస్తే.. చంపేస్తారా?
ఎస్సీ, బీసీ మహిళలు స్వేచ్ఛగా నచ్చిన వారికి ఓటు వేసే హక్కు లేదా అని మహిళా చైర్‌పర్సన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఓట్లేసినంత మాత్రాన అదే పాపమని చంపేస్తారా అంటూ నిలదీశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళల పట్ల చిన్నచూపుతో వ్యవహరించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతున్న చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారని ఆమె చెప్పారు. బాధిత మహిళలకు ఏపీ మహిళా కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.