Telugu Global
Andhra Pradesh

రాజీనామాలు వెనక్కి తీసుకుంటాం.. వాలంటీర్ల విన్నపాలు

వారు చెబుతున్న కారణాలేవైనా.. వైసీపీ వల్లే తమ భవిష్యత్ నాశనమైపోయిందని వాలంటీర్లు ఆరోపిస్తున్నట్టుగా ఎల్లో మీడియా కథనాలిస్తోంది.

రాజీనామాలు వెనక్కి తీసుకుంటాం.. వాలంటీర్ల విన్నపాలు
X

జగనన్న గెలుపే మా లక్ష్యం..

అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా మా చేతులు కట్టేశారు, ఇదెక్కడి న్యాయం..

జగన్ కోసమే మేం రాజీనామా చేస్తున్నాం..

ఉద్యోగాలు వదిలేసి మరీ వైసీపీ విజయం కోసం పనిచేస్తాం..

రాజీనామాలు చేశాం, ఇక మమ్మల్నెవరూ ఆపలేరు..

ఎన్నికల వేళ సామూహిక రాజీనామాలు చేస్తున్న సందర్భంలో వాలంటీర్లు చెప్పిన మాటలివి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రాజీనామాలు చేసినవారంతా తిరిగి విధుల్లో చేరతామంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు వినతిపత్రాలిస్తున్నారు. వైసీపీ నేతలు బలవంతంగా తమతో రాజీనామాలు చేయించారని, తప్పైపోయిందని, తమని క్షమించాలని వేడుకుంటున్నారు.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు ఉన్నారు. కానీ జగన్ వారిని పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా ఉంచాలనుకున్నారు. అది సాధ్యం కాకపోవడంతో ప్రత్యేకంగా గృహసారథులు తెరపైకి వచ్చారు. కానీ ఎన్నికల్లో ప్రజల వివరాలన్నీ తెలిసిన వాలంటీర్లు వైసీపీకి అండగా నిలబడతారని వైసీపీ అంచనా వేసింది. వారి అంచనా మేరకే చాలా చోట్ల వాలంటీర్లు రాజీనామాలు చేసి మరీ పార్టీకోసం పనిచేశారు. అవి బలవంతపు రాజీనామాలా, లేక స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలేశారా అనేది అప్పట్లో పెద్ద చర్చకు తావిచ్చింది. అలాంటి టైమ్ లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వంటి నేతల వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. కొంతమంది మాత్రం ఎన్నికల తర్వాత చూసుకుందాం అన్నట్టుగా రాజీనామాలు చేయలేదు. వారంతా నేడు రూ.10వేల జీతంపై ఆశ పెట్టుకున్నారు.

చంద్రబాబు వచ్చాక సచివాలయాలు ఉండవు, వాలంటీర్ వ్యవస్థ ఉండదు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన సచివాలయ వ్యవస్థ జోలికి వెళ్లేలా లేరు. పైగా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు వాలంటీర్లకు రూ.10వేలు జీతం ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో రాజీనామాలు చేసిన వాలంటీర్లంతా స్థానిక టీడీపీ నేతలు, టీడీపీ ఎమ్మెల్యేలను కలసి వినతి పత్రాలిస్తున్నారు. వారు చెబుతున్న కారణాలేవైనా.. వైసీపీ వల్లే తమ భవిష్యత్ నాశనమైపోయిందని వాలంటీర్లు ఆరోపిస్తున్నట్టుగా ఎల్లో మీడియా కథనాలిస్తోంది. మొత్తానికి ఏ వ్యవస్థ అయితే ఎన్నికల్లో తమ విజయానికి అండగా ఉంటుంది అని జగన్ అంచనా వేశారో.. ఆ వ్యక్తులు, ఆ వ్యవస్థ మొత్తం ఇప్పుడు చంద్రబాబుకి జై కొట్టేందుకు సిద్ధమైంది.

First Published:  16 Jun 2024 12:43 AM GMT
Next Story