Telugu Global
Andhra Pradesh

పని పెరిగింది, జీతం పెరిగింది.. వాలంటీర్లకు కొత్త బాధ్యతలు

పని భారం పెంచినందుకు బాధపడాలో, పారితోషికం పెంచినందుకు సంతోషపడాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు వాలంటీర్లు.

పని పెరిగింది, జీతం పెరిగింది.. వాలంటీర్లకు కొత్త బాధ్యతలు
X

ఏపీలో అంగన్వాడీల ఆందోళనతోపాటు.. గ్రామ, వార్డు వాలంటీర్లు కూడా నిరసనకు దిగుతున్నారంటూ ఇటీవల ఎల్లో మీడియా కోడై కూస్తోంది. అయితే తామెక్కడా నిరసన చేపట్టలేదని వాలంటీర్ల సంఘాలు వివరణ కూడా ఇచ్చాయి. అక్కడక్కడ కొంతమంది ఆందోళనకు దిగితే.. వారిని వెంటనే సస్పెండ్ చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు కొత్త బాధ్యతలు అప్పజెబుతూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ పర్యవేక్షణ బాధ్యతను వారికి అప్పగించింది.

ఇప్పటి వరకూ ఏపీలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(MDU) ఆపరేటర్లు రేషన్ సరకులు ఇస్తున్నారు. ఇప్పుడు వారితోపాటు వాలంటీర్లు కూడా ప్రతి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. రేషన్ సక్రమంగా అందుతుందా లేదా అనేది చెక్ చేయాల్సిన బాధ్యత ఇకపై వారికి కూడా ఉంటుంది. తమకు కేటాయించిన 50 ఇళ్లకు సంబంధించి రేషన్ సరిగా పంపిణీ అవుతుందో లేదో వారే పర్యవేక్షించాలి. ఇందుకోసం ప్రతి వాలంటీర్ కు ప్రభుత్వం అదనంగా రూ.750 రూపాయలు ఇస్తుంది. అంటే వీరికి నెలనెలా ఇస్తున్న గౌరవ పారితోషికం రూ.5000కు ఇది అదనం.

ఆమధ్య జీతాల కోసం రోడ్డెక్కిన వాలంటీర్లు అది సేవ, ఉద్యోగం కాదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పడంతో వెనక్కి తగ్గారు. అదే సమయంలో జాబ్ చార్ట్ లోని పనులు మాత్రమే తాము చేస్తామని, అదనపు పనులు తమకు అప్పగించొద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయంపై కొన్నిరోజులుగా అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నారు వాలంటీర్లు. ఈ టైమ్ లో కొత్తగా మరో పని అప్పజెప్పడంతో వారు షాకయ్యారు. 50ఇళ్లకు రేషన్ పంపిణీ పర్యవేక్షించినందుకు ప్రభుత్వం ఇచ్చే పారితోషికం రూ.750 మాత్రమే. పని భారం పెంచినందుకు బాధపడాలో, పారితోషికం పెంచినందుకు సంతోషపడాలో అర్థంకాని పరిస్థితి. ఈ వ్యవహారాన్ని వైసీపీ అనుకూల మీడియా 'వాలంటీర్లకు ప్రభుత్వం అందిస్తున్న బంపర్ ఆఫర్'గా పేర్కొంటోంది. వాస్తవంగా వాలంటీర్లు దీన్ని ఎలా చూస్తారనేదే అసలు ప్రశ్న.

First Published:  30 Dec 2023 8:29 AM IST
Next Story