Telugu Global
Andhra Pradesh

వాలంటీర్లపై పెత్తనం ఇక సెక్రటరీలదే..

ప్రస్తుతం ఏపీలో 2.66 లక్షల మంది వాలంటీర్లు నెలకు రూ.5వేలు గౌరవ వేతనం తీసుకుంటూ విధులు నిర్వహిస్తున్నారు. సేవా రత్న, సేవా వజ్ర.. లాంటి అవార్డులు మాత్రమే వీరికి అదనపు భరోసానిస్తున్నాయి.

వాలంటీర్లపై పెత్తనం ఇక సెక్రటరీలదే..
X

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తోంది అనడంలో ఆశ్చర్యం లేదు. వాలంటీర్ల నియామకం, తొలగింపు అన్నీ స్థానిక నాయకుల చేతుల్లోనే ఉంటాయి. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నా.. నాయకుల అండదండలు ఉన్నంత కాలం వారికి ఏమీ కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా వాలంటీర్ల తొలగింపు విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్లు, ఆయా ససచివాలయాల సెక్రటరీలు, వార్డు అడ్మిన్ల అనుగ్రహం ఉన్నంత కాలమే పనిచేయగలుగుతారు. సెక్రటరీల ఆగ్రహానికి గురయితే వారి పోస్ట్ ఊడిపోతుంది.

ఇన్నాళ్లూ వాలంటీర్ల తొలగింపు పూర్తిగా నాయకుల చేతుల్లోనే ఉండేది. వారికి ఇష్టమైనవారిని కొనసాగించేవారు, లేకపోతే తొలగించేవారు. ప్రత్యేక కారణాలు కూడా చూపించాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు వాలంటీర్ల తొలగింపుకి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. వాలంటీర్లపై ఫిర్యాదులు వస్తే వాటిని సెక్రటరీలు పరిశీలిస్తారు. తొలిదశల విచారణ చేపడతారు, వారిపై వేటు వేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే.. ఎంపీడీవో లేదా, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తారు. అక్కడ తొలగింపు ప్రక్రియ మొదలవుతుంది. ఇన్నాళ్లూ దీనిపై మార్గదర్శకాలు లేవు, తాజాగా సచివాలయాల శాఖ గైడ్ లైన్స్ విడుదల చేసింది.

ప్రస్తుతం ఏపీలో 2.66 లక్షల మంది వాలంటీర్లు నెలకు రూ.5వేలు గౌరవ వేతనం తీసుకుంటూ విధులు నిర్వహిస్తున్నారు. సేవా రత్న, సేవా వజ్ర.. లాంటి అవార్డులు మాత్రమే వీరికి అదనపు భరోసానిస్తున్నాయి. ఇప్పుడు వీరి తొలగింపు ప్రక్రియ విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వారిపై పెత్తనం మొత్తం కార్యదర్శుల చేతుల్లో పెట్టింది.

First Published:  9 May 2023 3:18 AM
Next Story