Telugu Global
Andhra Pradesh

పవన్ కల్యాణ్ కు 10 ప్రశ్నలు.. వాలంటీర్ల ఘాటు లేఖ

పావలా అంత పరువు కూడా లేని పవన్ కల్యాణ్ కు రాష్ట్రంలోని లక్షా 30వేలమంది మహిళా వాలంటీర్లు నమస్కరించకుండా రాస్తున్న లేఖ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పవన్ కల్యాణ్ కు 10 ప్రశ్నలు.. వాలంటీర్ల ఘాటు లేఖ
X

ఏపీలో వాలంటీర్లు వర్సెస్ పవన్ కల్యాణ్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దిష్టిబొమ్మలు తగలబెట్టడం, మానవహారాలు, నిరసనలు.. ఇవన్నీపూర్తయ్యాయి. ఇప్పుడు పవన్ కు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు వాలంటీర్లు. తాజాగా మహిళా వాలంటీర్లు పవన్ కు లేఖ రాశారు. అందులో 10 ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు జనసేనాని సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

పావలా అంత పరువు కూడా లేని పవన్ కు రాష్ట్రంలోని లక్షా 30వేలమంది మహిళా వాలంటీర్లు నమస్కరించకుండా రాస్తున్న లేఖ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "అయ్యా జల్సా రాయుడు గారూ.. మీరు మమ్మల్ని మానవ అక్రమ రవాణాకు పాల్పడే క్రిమినల్స్ అన్నారు. ఒంటరి ఆడవాళ్ళ సమాచారం సేకరిస్తామని..యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిల వివరాలు సేకరిస్తామని దానిని సంఘ విద్రోహ శక్తులకు అమ్మేస్తున్నామని మా ఆత్మాభిమానంపై దాడి చేశారు. మమ్మల్ని కన్నవారి ఆత్మాభిమానంపై దాడి చేశారు." మాకు క్షమాపణ చెప్పకపోతే మీ వారాహి యాత్ర ముందుకు సాగదంటూ హెచ్చరించారు. లేఖతోపాటు 10 ప్రశ్నలు జతచేశారు. వాటికి పవన్ సమాధానం చెప్పాలన్నారు.

10 ప్రశ్నలు..

1. వాలంటీర్లు అంటే బైక్ లకు సైలెన్సర్లు పీకి రయ్ రయ్ మంటూ దూసుకుపోయే రౌడీ బ్యాచ్ అనుకున్నావా?

2. వాలంటీర్లు అంటే సినిమా థియేటర్లలో తెరలు చింపి, కుర్చీలు విరగొట్టి నిప్పుపెట్టే బ్యాచ్ అనుకున్నావా?

3. వాలంటీర్లు అంటే మిగతా హీరోల ఆడియో ఫంక్షన్లలో పవర్ స్టార్ అంటూ రచ్చ చేసే బ్యాచ్ అనుకున్నావా?

4. వాలంటీర్లు అంటే పక్క హీరోల సినిమాలు రిలీజైన రోజే ఫ్లాప్ ఫ్లాప్ అంటూ తప్పుడు ప్రచారం చేసే బ్యాచ్ అనుకున్నావా?

5. వాలంటీర్లు అంటే మహిళల పట్ల గౌరవం లేకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే బ్యాచ్ అనుకున్నావా?

6. వాలంటీర్లు అంటే రేణు దేశాయ్ ను కూడా గౌరవం లేకుండా అవమానించే చిల్లర బ్యాచ్ అనుకున్నావా?

7. వాలంటీర్లు అంటే ఎయిర్ పోర్టుల్లో మంత్రులపై కర్రలతో, రాళ్లతో దాడులు చేసే గూండా బ్యాచ్ అనుకున్నావా?

8. వాలంటీర్లు అంటే బాగున్న రోడ్లు తవ్వేసి.. దాని ముందు సెల్ఫీలు దిగే అల్లాటప్పా బ్యాచ్ అనుకున్నావా?

9. వాలంటీర్లు అంటే నీ పేరు చెప్పి వృద్ధుల దగ్గర సంతకాలు పెట్టించుకుని ఆస్తులు కొట్టేసే బ్యాచ్ అనుకున్నావా?

10. వాలంటీర్లు అంటే ప్యాకేజీ కోసం నువ్వు ఎత్తుకోమన్న ప్రతి జెండాను భుజానికెత్తుకునే బానిస బ్యాచ్ అనుకున్నావా?

క్యారవ్యాన్ ఫుడ్డు, క్యారవాన్ బెడ్డు అలవాటైన పవన్ కి వాలంటీర్ల సేవాగుణం తెలియదని ముక్తాయించారు.

First Published:  13 July 2023 9:00 PM IST
Next Story