వాలంటీర్ జిందాబాద్.. చివరకు ఈనాడు కూడా
ఒడిశా ఘటన హైలెట్ అయిన తర్వాత, సహజంగానే ఏపీలో వాలంటీర్ వ్యవస్థ గురించి చర్చ జరిగింది. ఏపీలో అలాంటి ఘటనలు అస్సలు జరిగే అవకాశం లేదని అంటున్నారు.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై ఎన్ని ఆరోపణలు వస్తున్నాయో లెక్కే లేదు. చివరకు కోర్టు కేసులు కూడా దాఖలయ్యాయి. అయితే ఆ వ్యవస్థ వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. వాలంటీర్ల సేవలు ఎంత అవసరమో చెప్పే ఉదాహరణలు అప్పుడప్పుడూ బయటపడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. ఒడిశా ఘటనకు ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధమేంటని అనుకుంటున్నారా..? ఆ ఘటన వల్లే ఇప్పుడు ఏపీ వాలంటీర్ల గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
ఒడిశాలోని నబ్రంగ్ పుర్ జిల్లా జారిగోన్ ప్రాంతానికి చెందిన సూర్య హరిజన్ అనే 70 ఏళ్ల వృద్ధురాలు సామాజిక పింఛను తీసుకునేందుకు బ్యాంకుకు వెళుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరిగా నడవలేని స్థితిలో ఉన్న ఆమె, విరిగిపోయిన కుర్చీ సాయంతో, కాళ్లకు చెప్పుల్లేకుండా ఎండలో నడుచుకుంటూ వెళుతున్న వీడియో అది. దేశవ్యాప్తంగా ఈ వీడియోని అన్ని మీడియా సంస్థలు హైలెట్ చేశాయి. ఈనాడు కూడా కథనం ఇచ్చింది. ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. మానవతాదృక్పథంతో ఆమెకు సాయం చేయాలని బ్యాంకు అధికారులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి జోక్యం చేసుకోవడంతో బ్యాంక్ అధికారులు దిగొచ్చారు. గ్రామంలో పింఛన్ ఇచ్చే సీఎస్పీ పాయింట్ వద్ద వేలిముద్రలు పడకపోవడంతో ఆమె బ్యాంక్ వరకు వస్తున్నారని వివరణ ఇచ్చారు. ఆమెకు చక్రాల కుర్చీ ఇప్పిస్తామని, ఇకపై ఇంటి వద్దకే పింఛన్ తీసుకెళ్లి ఇస్తామన్నారు. ఆమధ్య ఒడిశాలోనే ఓ వికలాంగుడికి పింఛన్ ఇచ్చేందుకు గ్రామ సర్పంచ్ డ్రోన్ కెమెరా కొనుగోలు చేశారు. అక్కడి పింఛన్ పంపిణీ వ్యవస్థ తీరుకి ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి.
ఏపీలో పరిస్థితి వేరు..
ఏపీలో వాలంటీర్లు ఒకటో తేదీనే సామాజిక పింఛన్లు తీసుకెళ్లి లబ్ధిదారుల చేతిలో పెడుతున్నారు. మధ్యాహ్నానికల్లా తమ టార్గెట్ పూర్తి చేస్తారు. దాదాపుగా ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ నూటికి నూరు శాతం పూర్తవుతుంది. అంటే ఒడిశా వృద్ధ మహిళ పడిన పాట్లు ఏపీలో ఏ గ్రామంలోనూ, ఏ వార్డులోనూ కనిపించవు. అసలు ఇల్లు కదలకుండానే ప్రభుత్వం ఇచ్చే పింఛన్ నేరుగా చేతిలో వచ్చి పడుతుంది. పొరపాటున వేలిముద్రలు పడకపోయినా, ఇంకేదయినా సమస్య వచ్చినా, వెల్ఫేర్ అసిస్టెంట్ నేరుగా ఇంటికొస్తారు, సమస్య పరిష్కరిస్తారు. ఇక్కడ అలాంటి వ్యవస్థ ఉంది.
ఒడిశా ఘటన హైలెట్ అయిన తర్వాత, సహజంగానే ఏపీలో వాలంటీర్ వ్యవస్థ గురించి చర్చ జరిగింది. ఏపీలో అలాంటి ఘటనలు అస్సలు జరిగే అవకాశం లేదని అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల కలిగే ఉపయోగాల గురించి మరోసారి ఏపీ ప్రభుత్వానికి ఈనాడుతో సహా అందరూ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్టయింది.