ఏపీలో వాలంటీర్ల భవిష్యత్ తేలేది ఆరోజే
వైసీపీ వస్తే రాజీనామాలు చేసిన వారు సేఫ్, కూటమి వస్తే రాజీనామాలు చేయకుండా జీతాలు తీసుకున్న వారు సేఫ్. ఎలా చూసినా కొందరికి సంతోషం, మరికొందరికి బాధ మిగులుతుంది.
ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ వ్యవస్థ కూడా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఎన్నికల సమయంలో వాలంటీర్ల కేంద్రంగా రాజకీయాలు జరిగాయి. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచేందుకు కోర్టులో కేసులు వేసింది ప్రతిపక్షం. అంతే కాదు, పెన్షన్ల పంపిణీకి కూడా వాలంటీర్లను దూరం చేసింది. ఈ దశలో వాలంటీర్లలో చాలామంది స్వచ్ఛందంగా తమ ఉద్యోగాలు వదులుకున్నారు. మరికొందరు వైసీపీ నేతల భరోసాతో రాజీనామాలు చేశారు. వీరంతా ఎన్నికల వేళ వైసీపీ గెలుపుకోసం చురుగ్గా పనిచేశారు. ఇప్పుడు ఎన్నికలైపోయాయి, ఎన్నికల ఫలితాలతోపాటు వాలంటీర్ల భవిష్యత్తు కూడా జూన్-4న తేలిపోతుంది.
వైసీపీ ప్రభుత్వం దాదాపు 2.57 లక్షల మందికి వాలంటీర్ ఉద్యోగాలిచ్చింది. వారిలో చాలామంది ఎన్నికల వేళ రాజీనామాలు చేశారు. రాజీనామా చేయని వారికి పని కేటాయించకపోయినా ప్రభుత్వం జీతాలు మాత్రం చెల్లిస్తోంది. ఇక రాజీనామా చేసిన వారందర్నీ మళ్లీ తమ ప్రభుత్వం వస్తే తిరిగి ఆయా పోస్టుల్లోకి తీసుకుంటామని వైసీపీ నేతలు గట్టి హామీ ఇచ్చారు. అంటే వైసీపీ అధికారంలోకి వస్తే రాజీనామా చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే సమయంలో రాజీనామా చేయనివారిపై కక్షసాధింపు చర్యలు ఉంటాయన్న ఆరోపణని కొట్టిపారేయలేం.
కూటమి వస్తే..
ఇక కూటమి అధికారంలోకి వస్తే రాజీనామాలు చేయని వారికి కాలం కలిసొస్తుందని చెప్పాలి. వాలంటీర్ల పారితోషికాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే రాజీనామాలు చేసినవారు మాత్రం ఇరుకున పడే అవకాశముంది. కొత్త ప్రభుత్వం ఏర్పడితే, వైసీపీకి మద్దతుగా రాజీనామాలు చేసిన వాళ్లంతా తమ పోస్ట్ లపై ఆశలు వదులుకోవాల్సిందే. జీతం పెరగకపోవడమే కాదు, ఉన్న ఉద్యోగం కూడా పోయినట్టే అనుకోవాలి. అయితే గతంలో వాలంటీర్ పోస్ట్ లే వద్దు అని చెప్పిన చంద్రబాబు, వారికి జీతాలు రెట్టింపు చేస్తే, ఏ స్థాయిలో పనిచేయించుకుంటారో అర్థం చేసుకోవచ్చు. అంటే కూటమి వచ్చినా వాలంటీర్లకు జీతాలు పెరగడంతోపాటు, పని కూడా పెరుగుతుంది, ఆ కొలువు ఎన్నిరోజులు ఉంటుందో కూడా చెప్పలేం.
వైసీపీ వస్తే రాజీనామాలు చేసిన వారు సేఫ్, కూటమి వస్తే రాజీనామాలు చేయకుండా జీతాలు తీసుకున్న వారు సేఫ్. ఎలా చూసినా కొందరికి సంతోషం, మరికొందరికి బాధ మిగులుతుంది. ఎవరికి ఏది అనేది జూన్-4న తేలుతుంది.