ఇయర్ ఫోన్స్‌తో డ్రైవింగ్ చేస్తే రూ.20 వేల జరిమానా..! - దీనిపై ఏపీ రవాణా శాఖ క్లారిటీ
పలు వాట్సాప్ గ్రూపుల్లో తీవ్రంగా వైరల్ అవుతున్న ఈ మెసేజ్‌పై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ బుధవారం స్పందించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రాష్ట్రంలో సవరించిన జరిమానాలు వసూలు చేస్తున్నట్టు రవాణా శాఖ కమిషనర్ తెలిపారు.
ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్ పెట్టుకొని బైక్, కారు డ్రైవ్ చేస్తే రూ.20 వేల జరిమానా ఖాయం.. అంటూ సోషల్ మీడియాలో రెండు రోజులుగా విపరీతంగా ఓ మెసేజ్ సర్క్యులేట్ అవుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు నెల నుంచి ఈ జరిమానా అమల్లోకి వస్తుందని, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ఈ మేరకు ప్రకటించిందని కూడా ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ అంశం వాహనచోదకుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
పలు వాట్సాప్ గ్రూపుల్లో తీవ్రంగా వైరల్ అవుతున్న ఈ మెసేజ్‌పై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ బుధవారం స్పందించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రాష్ట్రంలో సవరించిన జరిమానాలు వసూలు చేస్తున్నట్టు రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే తొలిసారి రూ.1500 నుంచి రూ.2వేలు జరిమానా విధిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇదే విధంగా పదేపదే పట్టుబడితే రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం ఉన్న ఈ నిబంధన చాలా కాలంగా అమల్లో ఉందని చెప్పారు. ఈ అంశంలో జరిమానా పెంపు ఆలోచన లేదని కమిషనర్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో చేసే అసత్య ప్రచారాలను వాహనదారులు నమ్మొద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు.