Telugu Global
Andhra Pradesh

జీఎస్టీ కలెక్షన్‌లో దేశ సగటును మించిపోయిన ఏపీ

రాష్ట్రానికి అధికంగా ఆదాయాన్ని ఇచ్చే శాఖలపై సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు. తొలి ఆరు నెలల్లో పన్నుల వసూలు ఆశాజనకంగానే ఉన్నా.. టార్గెట్‌ను చేరకపోవడంపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

జీఎస్టీ కలెక్షన్‌లో దేశ సగటును మించిపోయిన ఏపీ
X

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) కలెక్షన్లలో ఏపీ దూసుకొని పోతోంది. ఇప్పటికే దేశ సగటును దాటేసి ఏపీ ట్యాక్స్ వసూలు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం సగం ముగిసే సరికి (సెప్టెంబర్ 2022) దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు నిర్ణయించిన టార్గెట్‌లో సగటున 27.8 శాతం వసూలు కాగా, ఏపీలో మాత్రం 28.79 శాతం వసూలైనట్లు అధికారులు తెలిపారు. తొలి అర్థ సంవత్సరానికి రూ. 27,445 కోట్లు టార్గెట్ కాగా.. రూ. 25,928 కోట్లు వసూలయ్యింది. కాగా, దేశ సగటు కంటే ఎక్కువగానే వసూళ్లు అవుతున్నా.. టార్గెట్‌ను దాటకపోవడంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. టార్గెట్ పూర్తి చేయడానికి పన్నులను పెంచకుండా.. ఇతర మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రానికి అధికంగా ఆదాయాన్ని ఇచ్చే శాఖలపై సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు. తొలి ఆరు నెలల్లో పన్నుల వసూలు ఆశాజనకంగానే ఉన్నా.. టార్గెట్‌ను చేరకపోవడంపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అత్యధికంగా వాహనాలు అమ్ముడయ్యాయి. కానీ పన్నుల వసూళ్లు మాత్రం తక్కువగా ఎందుకున్నాయని ప్రశ్నించారు. అయితే, చాలా మంది డీలర్లు వాహనాలను బుక్ చేసినా.. డెలివరీ చేయలేదని అధికారులు చెప్పారు. పన్నులను కట్టని వాహన డీలర్లపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పన్ను వసూళ్లలో ఉన్న లోటుపాట్లను గుర్తించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఉన్న టార్గెట్‌ను పూర్తి చేసినందుకు అభినందించారు. అయితే ఈ శాఖలో ఉన్న చిన్న లోటు పాట్లు, ఇతర రాష్ట్రాల్లో ఎలా పన్నులు వసూలు చేస్తున్నారో ఒక నివేదిక ఇవ్వాలని కోరారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, రజత్ భార్గవ, నీరబ్ కుమార్ ప్రసాద్, గుల్జార్‌ల కమిటీ రెండు వారాల్లో ఈ శాఖకు సంబంధించిన నివేదికను ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో పన్నులు చెల్లించాలని కోరుతూ గ్రామ సచివాలయాలు, ఇతర కార్యాలయాల్లో పోస్టర్లు అతికించాలని సీఎం సూచించారు. కేవలం ఈ రెండు శాఖలే కాకుండా ఇతర శాఖలు కూడా పన్ను వసూళ్లలో ఉన్న లీకేజీలను గమనించాలని కోరారు. అలాగే మైనింగ్ లీజుకు తీసుకున్న వారు ఇటీవల కొన్ని ఫిర్యాదులు చేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

First Published:  7 Oct 2022 8:47 AM IST
Next Story