జగన్ లెక్క టీడీపీకి 'సున్నా'.. బాబు లెక్క వైసీపీకి '35'
విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన చంద్రబాబు హైదరాబాద్లోని తన నివాసంలో టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన సంఘటనలను వారిని అడిగి తెలుసుకున్నారు.
వైనాట్ 175 అనే మాటని పోలింగ్ తర్వాత కూడా వెనక్కి తీసుకోలేదు సీఎం జగన్. లండన్ పర్యటనకు వెళ్లే టైమ్ లో కూడా ఆయన 175 సీట్లకు తగ్గేదే లేదన్నారు. ఏపీ రిజల్ట్ చూసి దేశం మొత్తం షాకవుతుందని కూడా చెప్పారు. ఇక చంద్రబాబు విషయానికొస్తే.. గతంలో ఎప్పుడూ నెంబర్ గేమ్ జోలికి వెళ్లని ఆయన తాజాగా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చి ఏపీ ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమికి 140 స్థానాల వరకు వస్తాయని అంచనా వేశారు.
రాష్ట్రంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. పోలింగ్ రోజు, ఆ తర్వాత వైసీపీ శ్రేణులు హింసాకాండ సృష్టించాయని అన్న ఆయన, కౌంటింగ్ రోజు మరింత అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన చంద్రబాబు హైదరాబాద్లోని తన నివాసంలో టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన సంఘటనలను వారిని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ కుట్రల్ని ఎదుర్కొంటూ ఈసీని, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని నేతలకు చెప్పారు బాబు.
వైసీపీకి 35..
వైనాట్ 175 అని వైసీపీ ధీమాగా చెప్పుకుంటున్నా.. ఈసారి మాత్రం ఆ పార్టీకి 35 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు చంద్రబాబు. కూటమిదే విజయం అంటూ పార్టీ నేతలకు ధైర్యం నూరిపోశారు. చంద్రబాబు అమరావతికి చేరుకుని రేపు పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యే అవకాశముంది. ఆ తర్వాత కౌంటింగ్ వ్యవహారంలో పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేస్తారు.