Telugu Global
Andhra Pradesh

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు..

వారందరిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఏపీ అసెంబ్లీలో 8 స్థానాలు ఖాళీ అయినట్టు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌.. ఎన్నికల సంఘానికి సమాచారాన్ని పంపారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు..
X

ఏపీలో 8మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ 8మందిని అనర్హులుగా ప్రకటిస్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. పలుమార్లు విచారణల అనంతరం ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. దీంతో ఏపీ శాసన సభలో 8 సీట్లు ఖాళీ అయినట్టు తేలింది. ఈరోజు గెజిట్ విడుదలైనప్పటి నుంచి ఆ 8 మంది మాజీ ఎమ్మెల్యేలుగా మారిపోతారు.

ఎందుకీ వేటు..?

అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలలో నలుగురు ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారు, మరో నలుగురు సైకిల్ గుర్తుపై గెలిచిన వారు ఉన్నారు. జనసేన ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీవైపు వచ్చిన రాపాక వరప్రసాద్ పై ఎవరూ ఫిర్యాదు చేయకపోయే సరికి ఆయన మాత్రం ఈ వేటు నుంచి తప్పించుకున్నారు. సడన్ గా రాజ్యసభ ఎన్నికలకు ముందు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సమస్య వస్తుందనే ఉద్దేశంతో వైసీపీ ముందుగా ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోటీగా టీడీపీ కూడా ఫిర్యాదు చేయడంతో మొత్తం 8మందిని పిలిపించి విచారణ చేపట్టారు స్పీకర్ తమ్మినేని. వైసీపీ రెబల్స్ తమపై వేటు సరికాదన్నారు. టీడీపీ రెబల్స్ లో ఒక్కరే విచారణకు వచ్చారు. చివరకు వారందరిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఏపీ అసెంబ్లీలో 8 స్థానాలు ఖాళీ అయినట్టు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌.. ఎన్నికల సంఘానికి సమాచారాన్ని పంపారు.

వాస్తవానికి ఫిరాయింపుల పర్వం టీడీపీ ఎమ్మెల్యేలతోనే మొదలైంది. అయితే గతంలో చంద్రబాబులాగా సీఎం జగన్ టీడీపీ ఎమ్మెల్యేలను గంపగుత్తగా కొనేయలేదు. వైసీపీ వైపు వస్తామన్న వారికి నేరుగా పార్టీ కండువా కూడా కప్పలేదు. వారి కుటుంబ సభ్యులకు మాత్రం కండువాలు కప్పారు. దీంతో ఆ ఎమ్మెల్యేలంతా జగన్ వైపు వచ్చినట్టయింది. కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ తోపాటు, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఇదే రూట్ లో జగన్ టీమ్ లో చేరారు. ఈ ఫిరాయింపులపై టీడీపీ తేలుకుట్టిన దొంగలా ఉంది. ఆ తర్వాత నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో టీడీపీ వైపు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటువేయడం ద్వారా వారు పూర్తిగా లైన్ దాటారు. అయితే అప్పటికప్పుడు వైసీపీ కూడా వారి అనర్హత గురించి మాట్లాడలేదు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో గత ఎమ్మెల్సీ ఎన్నికల నాటి సీన్ రిపీట్ అవుతుందేమోనన్న సందేహంతో పార్టీ ముందు జాగ్రత్తపడింది. ఈ ఎపిసోడ్ లో మొత్తం 8మంది మాజీలవుతున్నారు.

First Published:  27 Feb 2024 6:49 AM IST
Next Story