Telugu Global
Andhra Pradesh

ఏపీలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ వినియోగం.. అందుకే కోతలు..!

ఏపీలో విద్యుత్‌ వినియోగం ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ స్థాయికి చేరుకుందని, తీవ్ర ఎండలతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిందని చెబుతున్నారు అధికారులు.

ఏపీలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ వినియోగం.. అందుకే కోతలు..!
X

ఏపీలో కరెంటు కోతలు మొదలయ్యాయి. ప్రతిపక్షాలు కూడా ఈ కోతలపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. అయితే ఈ కోతలకు అసలు కారణం ఊహించని రీతిలో విద్యుత్ వినియోగం భారీగా పెరగడమేనంటున్నారు అధికారులు. వినియోగం పెరిగినా కోతలు లేకుండా చూస్తున్నామని చెబుతున్నారు.

ఎనిమిదేళ్ల గరిష్టానికి విద్యుత్ వినియోగం..

ఏపీలో విద్యుత్‌ వినియోగం ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ స్థాయికి చేరుకుందని, తీవ్ర ఎండలతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిందని చెబుతున్నారు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్.


రాష్ట్రంలో గత 24 గంటల్లో 251 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగిందని తెలిపారాయన. గత ఎనిమిదేళ్లలో ఈ స్ధాయిలో విద్యుత్‌ వినియోగం ఎప్పుడూ జరగలేదన్నారు. రాబోయే రోజుల్లో 255 మిలియన్ యూనిట్ల వరకు వినియోగం పెరిగే అవకాశముందని చెప్పారు. మరో వారం రోజులపాటు ఇదే విధంగా విద్యుత్‌ డిమాండ్‌ కొనసాగుతుందన్నారు.

ముందస్తు ప్రణాళికతో బహిరంగ మార్కెట్ లో 10 రూపాయిలుండే యూనిట్ విద్యుత్‌ ను 6.40 రూపాయల నుంచి రూ.7 లోపు కొంటున్నామని తెలిపారు అధికారులు. విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో రోజూ 30 నుంచి 40 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. మే నెలలో గరిష్టంగా 215 మిలియన్ యూనిట్ల వరకే వినియోగం ఉంటుందనుకున్నా.. రికార్డ్ స్థాయిలో 250 మిలియన్ యూనిట్లు దాటేసిందని అంటున్నారు.

First Published:  19 May 2023 4:59 PM IST
Next Story