Telugu Global
Andhra Pradesh

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఎటువైపు..?

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ కీలకంగా మారింది. ఉద్యోగుల ఓట్లపై ఇరు వర్గాలు నమ్మకం పెట్టుకున్నాయి.

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఎటువైపు..?
X

ఏపీలో హోమ్ ఓటింగ్ మొదలైంది, పోస్టల్ బ్యాలెట్ కొనసాగుతోంది. కూటమిలో అప్పుడే వణుకు పుట్టింది. ఉద్యోగులంతా తమవైపే అనుకున్న టీడీపీ ఇప్పుడు ఆలోచనలో పడింది. ఎల్లో మీడియా కూడా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. పోస్టల్ బ్యాలెట్ సక్రమంగా జరగడంలేదని, ఉద్యోగులను ప్రభావితం చేస్తున్నారంటూ కథనాలిస్తోంది. అంటే అసలు పోలింగ్ మొదలవకముందే ఎల్లో మీడియా.. కూటమి ఓటమికి కారణాలు వెదుకుతోందనమాట. దీన్నిబట్టి ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థమవుతోందని సోషల్ మీడియాలో విశ్లేషణలు వినపడుతున్నాయి.

ఏపీలో ఉద్యోగుల ఓట్లన్నీ తమకేనని నిన్న మొన్నటి వరకు ధీమాగా ఉంది టీడీపీ. వైసీపీ హయాంలో ఉద్యోగులను తిప్పలు పెట్టారని, టీచర్లకు వైన్ షాపుల వద్ద డ్యూటీలు వేశారని, వారితో స్కూల్ లో టాయిలెట్లు కడిగించారని, ఇతర డిపార్ట్ మెంట్లలో కూడా ఉద్యోగుల స్వేచ్ఛను హరించారనేది టీడీపీ ఆరోపణ. కానీ వాస్తవం వేరు. సీఎం జగన్ వల్ల ఉద్యోగాలు పొందిన సచివాలయాల స్టాఫ్ అంతా జగన్ వైపే ఉన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఖజానా నష్టాలను తమపై రుద్దకుండా ఉన్న సీఎం జగన్ ఆలోచనలను ఉద్యోగులు అర్థం చేసుకున్నారు. నాడు-నేడుతో పాఠశాలలను మెరుగుపరచిన జగన్ ముందుచూపుని టీచర్లు అభినందిస్తున్నారు. డిజిటల్ బోధనతో విద్యాప్రమాణాలను పెంచిన ముఖ్యమంత్రికి ఉపాధ్యాయులు మద్దతిస్తున్నారు. అందుకే పోస్టల్ బ్యాలెట్ వైసీపీవైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. అయితే ఎల్లో మీడియా మాత్రం ఈ విషయంలో తన అక్కసు వెళ్లగక్కుతోంది. గందరగోళంగా పోస్టల్ బ్యాలెట్ అంటూ ఆంధ్రజ్యోతి ఇచ్చిన ఆర్టికల్ చూస్తే వారి నైరాశ్యం అర్థం చేసుకోవచ్చు.

పోలీసుల నైతిక సామర్థ్యాన్ని కించపరుస్తూ పదే పదే రెడ్ బుక్ అంటున్న టీడీపీ నేతల్ని వారు ఓ కంట కనిపెడుతున్నారు. ఎవరి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారనే విషయంలో ఉద్యోగులకు కూడా కొన్ని అంచనాలున్నాయి. ఉద్యోగులకు రాజకీయాలు ఆపాదిస్తూ, వారిని నిత్యం కించపరుస్తూ, టార్గెట్ చేస్తున్న ఎల్లో మీడియాపై కూడా ఆ వర్గం రగిలిపోతోంది. వెరసి పోస్టల్ బ్యాలెట్ టీడీపీకి ఏకపక్షం కాదు అనేది తేలిపోయింది. పోస్టల్ బ్యాలెట్ వైసీపీ వైపు మొగ్గు చూపుతుందనే విషయం తేలిపోయింది.

First Published:  5 May 2024 10:18 AM IST
Next Story