Telugu Global
Andhra Pradesh

కలవరపెడుతున్న పోస్టల్ బ్యాలెట్.. టీడీపీ ధీమా ఏంటి..?

టీడీపీ అనుకున్నట్టుగా ఉద్యోగులంతా కూటమి అభ్యర్థులకే ఓటు వేశారని చెప్పలేం. కానీ వారి అంచనాలు వారికున్నాయి, అందుకే ఉద్యోగుల ఓట్ల చెల్లుబాటులో వారి మాట నెగ్గించుకున్నారు.

కలవరపెడుతున్న పోస్టల్ బ్యాలెట్.. టీడీపీ ధీమా ఏంటి..?
X

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ పై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, స్టాంప్.. రెండూ ఉండాలనేది ఎన్నికల కమిషన్ నిబంధన. కానీ ఏపీలో మాత్రం స్టాంప్ లేకపోయినా పర్లేదు, సంతకం ఉంటే చాలు అని సీఈఓ సడలింపు ఇచ్చారు. ఒకవేళ సంతకం ఫోర్జరీ అనిపిస్తే అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద అసలు సంతకంతో పోల్చుకోవాలని చెప్పారు. ఈ నిబంధనపై వైసీపీ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. టీడీపీ మాత్రం పరోక్షంగా ఈ నిబంధన తెచ్చేలా ఈసీకి గతంలో విజ్ఞప్తులు చేసింది. ఇప్పుడు ధీమాగా ఉంది.

పోస్టల్ బ్యాలెట్ ఎటువైపు..?

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు, సైన్యంలో పనిచేసే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు, ఈసారి కొందరు జర్నలిస్ట్ లకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. వైనాట్ 175 అంటున్న వైసీపీ పోస్టల్ బ్యాలెట్ విషయంలో మాత్రం వైనాట్ ఎంప్లాయిస్ అని అనుకోవడం లేదు. ఎందుకంటే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనేది వారి అనుమానం. సీపీఎస్ రద్దు, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్లు.. ఇలా చాలా విషయాల్లో ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఆ వ్యతిరేకత అంతా ఎన్నికల్లో బయటపెడతారని వైసీపీ అనుమానిస్తోంది. ఉద్యోగుల వైఖరి తమకు అనుకూలం అని టీడీపీ అంచనా వేస్తోంది.

నిబంధనలు తారుమారు..

వైసీపీపై ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలం అని అంచనా వేస్తున్న టీడీపీ.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో పట్టుబట్టి మరీ నిబంధనలు మార్చేలా చేసింది. అటెస్టింగ్ అధికారి స్టాంప్ సీల్ లేకుండా ఉన్న ఏ ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా వృథా కాకూడదనే ఉద్దేశంతో ఈసీకి ఫిర్యాదు చేసి మరీ ఏపీ వరకు నిబంధనలు మార్చేలా చేసింది.

టీడీపీ అనుకున్నట్టుగా ఉద్యోగులంతా కూటమి అభ్యర్థులకే ఓటు వేశారని చెప్పలేం. కానీ వారి అంచనాలు వారికున్నాయి, అందుకే ఉద్యోగుల ఓట్ల చెల్లుబాటులో వారి మాట నెగ్గించుకున్నారు. ఇక ఉద్యోగుల ఓట్లు తమకు ఎలాగూ పడవు అనుకుంటున్నారు కాబట్టి, వైసీపీ నేతలు నిబంధనలు కఠినంగా పాటించాల్సిందేనంటున్నారు. దేశం మొత్తం ఒకేలా ఉన్న నిబంధనలు ఏపీలో మాత్రం ఎందుకు మార్చారని ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద ఈసారి పోస్టల్ బ్యాలెట్ చాలా కీలకంగా మారే అవకాశముంది. సర్వే సంస్థలు కూడా పోస్టల్ బ్యాలెట్లు కూటమికే మొగ్గు చూపుతాయని అంచనా వేస్తున్నాయి.

First Published:  29 May 2024 1:29 AM GMT
Next Story