జగన్ సరే, మిగతా 10మంది ఎక్కడ..?
మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు మీడియా ముందుకొస్తున్నారు కానీ, గెలిచిన ఎమ్మెల్యేలెవరూ ప్రెస్ మీట్లు పెట్టేందుకు కూడా ఇష్టపడటం లేదు. జగన్ మినహా గెలిచిన ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నారు. ఈ మౌనం ఎన్నాళ్లో వేచి చూడాలి.
ఏపీలో వైసీపీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 11. పార్టీ అధినేత జగన్ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఆయన పర్యటనల వివరాలన్నీ ప్రజలకు తెలుసు. మరి మిగతా 10మంది ఎక్కడికెళ్లారు..? ఏం చేస్తున్నారు..? అనే సమాచారం పెద్దగా బయటకు రావడంలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో కనపడిన ఆ 10మంది ఇప్పుడు దాదాపుగా సైలెంట్ అయ్యారు. దీంతో వారిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.
కర్నూరు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కొన్నిరోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. కనీసం నియోజకవర్గంలో కూడా ఆయన ఎవరికీ అందుబాటులో లేరని తెలుస్తోంది. పనులకోసం సొంత పార్టీ నేతలు ఫోన్ చేసినా కూడా ఆయన స్పందించడంలేదట. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డి, వైసీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరారు. 2014, 2019, 2024లో వరుసగా వైసీపీ తరపున గెలిచారాయన. తాజా ఫలితాల తర్వాత కొన్నిరోజులు నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉన్న ఆయన హైదరాబాద్ వెళ్లి ఇక తిరిగి రాలేదని తెలుస్తోంది. మంత్రాలయంలో వైసీపీ సానుభూతి పరులైన కొందరు రేషన్ డీలర్లను, ఇతర సిబ్బందిని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని, ఇలాంటి టైమ్ లో ఎమ్మెల్యే అండగా లేకపోవడం సరికాదని స్థానిక నేతలు రుసరుసలాడుతున్నారు.
మాజీలే దిక్కయ్యారా..?
వైసీపీ ఓటమి తర్వాత కనీసం సాక్షి ఛానెల్ లో జరిగే చర్చలకు కూడా నేతలెవరూ హాజరు కావడంలేదు, మిగతా ఛానెళ్లలో కూడా వైసీపీ సానుభూతిపరులు కనపడుతున్నారే కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు ఎవరూ ఆవైపు చూడట్లేదు. ఇక ప్రెస్ మీట్లకు కూడా మాజీలే హాజరవుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు మీడియా ముందుకొస్తున్నారు కానీ, గెలిచిన ఎమ్మెల్యేలెవరూ ప్రెస్ మీట్లు పెట్టేందుకు కూడా ఇష్టపడటం లేదు. జగన్ మినహా గెలిచిన ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నారు. ఈ మౌనం ఎన్నాళ్లో వేచి చూడాలి.