కమలం కబంధహస్తాల్లో ఆంధ్రప్రదేశ్.. 1 శాతం ఓటు బ్యాంకు లేని బీజేపీ చుట్టూ ఏపీ రాజకీయాలు
ఏపీలో బీజేపీకి ఓట్లూ లేవు, సీట్లూ లేవు. అయినా అధికార, విపక్షాలు బీజేపీ కనుసన్నల్లోనే భయభక్తులతో మెలగడం చూస్తే సామాన్యులకు జాలి వేస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీ, ఒక్క పంచాయతీ వార్డు సభ్యుడు కూడా లేని బీజేపీ చుట్టూనే ఇక్కడి రాజకీయాలు తిరుగుతున్నాయి. 151 మంది ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టిన వైసీపీ, 23 సీట్లతో ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ, ఒకే ఒక్క సీటు గెలుచుకుని అదీ వైసీపీకి అర్పించేసిన జనసేన కూడా బీజేపీ కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయని సామాన్యులు సైతం మాట్లాడుకునే పరిస్థితి.
దేశంలోనే 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ ఎంపీలున్న పెద్ద పార్టీ వైసీపీ. అయితే విచిత్రంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రాపకం కోసం పాకులాడుతూ ఆంధ్రుల గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆరోపించిన విపక్షమైన టీడీపీకి ముగ్గురు ఎంపీలే ఉన్నా, మోదీ మాట మంచికైనా ఉచ్ఛరించడానికి భయపడుతున్నారు. రాహుల్ గాంధీ అనర్హతపై దేశంలో అన్ని పార్టీలూ స్పందించాయి. ఏపీ నుంచి టీడీపీ, వైసీపీలు ఉలుకూ లేదు, పలుకూ లేదు.
గత నెలలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల్ని కలిసి వచ్చారు సీఎం జగన్ రెడ్డి. టీడీపీ అధినేత మోదీ, షాల అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుద్దా అని కన్నులు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో రెండు రోజులుగా మకాం వేశారు. బీజేపీ పెద్దలు కరుణించి అపాయింట్మెంట్ ఇస్తారనే ఆశతో వేచి చూస్తూనే ఉన్నారు. చివరికి ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్ దర్శనం మాత్రమే పవన్ కళ్యాణ్‌కి దక్కింది. ప్రజలు గెలిపిస్తే గెలిచిన ప్రాంతీయ పార్టీల అధినేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దగ్గర ఎందుకు సాగిలపడుతున్నారో ఏపీ ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.
ఏపీలో బీజేపీకి ఓట్లూ లేవు, సీట్లూ లేవు. అయినా అధికార, విపక్షాలు బీజేపీ కనుసన్నల్లోనే భయభక్తులతో మెలగడం చూస్తే సామాన్యులకు జాలి వేస్తుంది. ప్రజల మద్దతుతో అధికారం దక్కించుకున్నవారు, ప్రతిపక్ష పాత్ర పోషించేవాళ్లు బీజేపీ పెద్దల కాళ్ల దగ్గర సాగిలపడటం..ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి వారి అనుమతి తీసుకోవడంపై విద్యావంతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో బీజేపీ ఉనికి కార్యవర్గం ఏర్పాటు వరకే. ఇక్కడ బీజేపీ సొంతంగా ఒక వార్డు మెంబర్‌గా కూడా గెలిచే అవకాశమే లేదు. బీజేపీ నేతలే చెబుతున్నట్టు వారి ఓటింగ్ శాతం ఏపీలో 0.86 మాత్రమే. ఇంతకంటే ఎక్కువ ఓట్లు సింగిల్‌గా పోటీ చేసినా ఏ ఎన్నికల్లోనూ బీజేపీకి రాలేదు. ఏమీలేని చోట బీజేపీ మాటే శాసనంగా, ఢిల్లీ పెద్దల దయాదాక్షిణ్యాలపై ఏపీ నేతల ఆధారపడటం మాత్రం ఆంధ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.