బలైపోతారు జాగ్రత్త.. బాబుకి పరిపూర్ణానంద శాపనార్థాలు
చంద్రబాబు, కొడుకు లోకేష్, బామ్మర్ది బాలకృష్ణ, కొడుకు తోడల్లుడు, వదిన.. ఇలా ఆ ఫ్యామిలీ నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారని మరి త్యాగాలు వారికి వర్తించవా అని లాజిక్ తీశారు పరిపూర్ణానంద.
ఏపీ ఎన్నికల్లో కూటమి వల్ల అందరూ నష్టపోతున్నారని, ఎక్కువగా నష్టపోయేది మాత్రం టీడీపీయేనని కుండబద్దలు కొట్టారు స్వామి పరిపూర్ణానంద. బీజేపీ తరపున హిందూపురం ఎంపీ సీటు ఆశించి భంగపడిన ఆయన.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని చెప్పారు. తనకు టికెట్ ఇవ్వకపోతే హిందూపురం అసెంబ్లీకి కూడా పోటీ చేసి బాలకృష్ణకు షాకిస్తానన్నారు.
పరిపూర్ణానంద లాజిక్ ఏంటి..?
ఏపీలో సడన్ గా కుదిరిన పొత్తుల వల్ల ఏ పార్టీ నేతలు కూడా సంతృప్తిగా లేరన్నారు పరిపూర్ణానంద. బీజేపీలోకి అంతా టీడీపీ బ్యాచ్ దిగిందని, బాబు మనుషులకే టికెట్లు ఇచ్చారని, జనసేన టికెట్ల వ్యవహారంపై కూడా టీడీపీ డామినేషన్ కనిపిస్తోందని చెప్పారు. వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారని, టీడీపీకి గట్టి గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. తనతోపాటు తన వద్దకు 26మంది అసంతృప్తులు వచ్చారని, వారంతా స్వతంత్రంగా బరిలో దిగేందుకు సిద్ధమంటున్నారని అన్నారు. అదే జరిగితే ఐదారువేల గ్యాప్ తో టీడీపీ పెద్ద సంఖ్యలో సీట్లు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు పరిపూర్ణానంద.
త్యాగానికి అర్థం తెలుసా బాబూ..!
పొత్తు వల్ల అన్ని పార్టీల నేతలు త్యాగం చేయాలని చంద్రబాబు సూచిస్తున్నారని, కానీ ఆ త్యాగాల పేరుతో బలైపోయింది మాత్రం బీజేపీ, జనసేన నేతలేనని చెప్పారు పరిపూర్ణానంద. చంద్రబాబు, కొడుకు లోకేష్, బామ్మర్ది బాలకృష్ణ, కొడుకు తోడల్లుడు, వదిన.. ఇలా ఆ ఫ్యామిలీ నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారని మరి త్యాగాలు వారికి వర్తించవా అని లాజిక్ తీశారు. బీజేపీలో కూడా చంద్రబాబు మనుషులకే టికెట్లు వచ్చాయని, జనసేనలో కూడా టీడీపీ నేతలే వెళ్లి టికెట్లు సాధించారని గుర్తు చేశారు. తనలాంటి సాధువులు, సన్యాసులు, అన్నీ పరిత్యజించిన వారిని ఇంకా త్యాగం చేయమంటే ఎలా అని ప్రశ్నించారు పరిపూర్ణానంద.
ఆ ఎఫెక్ట్ గట్టిగానే..
అసంతృప్తుల ఎఫెక్ట్ టీడీపీపై గట్టిగా పనిచేస్తుందని శాపనార్థాలు పెట్టారు పరిపూర్ణానంద. అన్ని పార్టీల్లోని అసంతృప్తులు కలిసి టీడీపీని ఓడించేస్తారని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఏపీలో బీజేపీ ఉనికి మాత్రమే పోతుందని, జనసేనకు కూడా పెద్దగా పోయేదేం లేదని, టీడీపీకి మాత్రం భారీ నష్టం కలుగుతుందన్నారు పరిపూర్ణానంద.