Telugu Global
Andhra Pradesh

ఏపీలో సంక్రాంతి సెలవల రాజకీయం..

సెలవల పొడిగింపు అనేది ఏపీలో రాజకీయ రచ్చగా మారింది. సంక్రాంతి సెలవలకు రాజకీయ రంగు పులిమేస్తున్నాయి పార్టీలు.

ఏపీలో సంక్రాంతి సెలవల రాజకీయం..
X

ఏపీలో సంక్రాంతి సెలవలను ప్రభుత్వం 3రోజులు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ పొడిగింపు ఇప్పుడు రాజకీయ రచ్చగా మారింది. సెలవలను ఎందుకు పొడిగించారో తెలుసంటూ జనసేన రచ్చ చేస్తోంది. సరిగ్గా 21 వరకే ఎందుకు సెలవలిచ్చారు, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవమైన 22వతేదీ సెలవు ఎందుకివ్వలేదంటూ బీజేపీ గొడవ మొదలు పెట్టింది. మొత్తమ్మీద ఏపీలో సంక్రాంతి సెలవలు కూడా రాజకీయాలకు వేదికగా మారడం మాత్రం గమనార్హం.


సంక్రాంతి సెలవలను పొడిగించే క్రమంలో.. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు నిర్ణయం తీసుకున్నామంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం విశేషం. గతంలో ఎప్పుడూ ఇలా విద్యార్థులు కోరారని, తల్లిదండ్రులు అడిగారని సెలవలు పొడిగించలేదని, ఇప్పుడే ఎందుకిలా అంటూ జనసేన లాజిక్ తీస్తోంది. అసలు సంగతి వేరే ఉందని అంటున్నారు జనసేన నేతలు. ఈనెల 19 విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉండడం వల్లే సీఎం జగన్ సెలవలు పొడిగించారని ఆరోపిస్తున్నారు. ఆ కార్యక్రమానికి భారీగా జనాల్ని తరలించాలని వైసీపీ ఆలోచిస్తోందని, ప్రైవేట్ స్కూల్స్ నుంచి బస్సుల్ని తీసుకుంటారని, అందుకే స్కూల్స్ కి సెలవలు ఇచ్చారని ఎద్దేవా చేస్తున్నారు జనసేన నేతలు. సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవహారంపై వైసీపీని నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు.

ఇంకోరోజు ఇస్తే మీ సొమ్మేం పోయింది..?

మరోవైపు బీజేపీ ఇంకోరకంగా స్పందిస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి సెలవల పొడిగింపుపై మండిపడ్డారు. ఈనెల 21వరకు సెలవలు పొడిగించి, 22న స్కూల్స్ రీఓపెన్ చేయాలనుకోవడం సరికాదంటున్నారామె. సరిగ్గా రామాలయం ప్రారంభోత్సవం రోజున ఏపీలో స్కూల్స్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఆరోజు చాలా రాష్ట్రాల్లో స్కూల్స్ కి సెలవలు ఇస్తున్నారని, పనిగట్టుకుని ఏపీ ప్రభుత్వం మాత్రం ఆరోజు స్కూల్స్ పెడుతోందని అన్నారు. సెలవల వ్యవహారంపై పునరాలోచించాలని ఆమె వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


మొత్తమ్మీద సెలవల పొడిగింపు అనేది ఏపీలో రాజకీయ రచ్చగా మారింది. సంక్రాంతి సెలవలకు రాజకీయ రంగు పులిమేస్తున్నాయి పార్టీలు. దీనిపై వైసీపీ రియాక్షన్ ఏంటో చూడాలి.

First Published:  18 Jan 2024 1:01 PM IST
Next Story