Telugu Global
Andhra Pradesh

2014లో లేని కక్షసాధింపు 2024లో ఎందుకు..?

2024లోనే కాదు, 2014లో కూడా టీడీపీ కూటమి అధికారంలో ఉంది. ఒకవేళ టీడీపీ కక్షసాధింపులు నిజమే అయితే అప్పుడెందుకు ఇలాంటి ఘటనలు జరగలేదని మరో వర్గం లాజిక్ తీస్తోంది.

2014లో లేని కక్షసాధింపు 2024లో ఎందుకు..?
X

తలలు పగులుతున్నాయి..

ఆఫీస్ లు కూలిపోతున్నాయి

విగ్రహాలు కాలిపోతున్నాయి..

ఎక్కడ చూసినా రాజకీయ కక్షసాధింపులే కనపడుతున్నాయంటూ వైసీపీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఐదేళ్ల పాలనలో తామూ కూడా ఇలాగే చేసి ఉంటే టీడీపీ బతికి బట్టకట్టేదా అని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగిస్తే, ఇప్పుడు కూటమి రాక్షస పాలనతో రాష్ట్రాన్ని తగలబెడుతోందని అంటున్నారు వైసీపీ నేతలు. మాకు ఓటువేసిన 40శాతం మంది ప్రజలు రాష్ట్రం వదిలి పారిపోవాలా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడే ఎందుకు..?

2024లోనే కాదు, 2014లో కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఒకవేళ టీడీపీ కక్షసాధింపులు నిజమే అయితే అప్పుడెందుకు ఇలాంటి ఘటనలు జరగలేదని మరో వర్గం లాజిక్ తీస్తోంది. అప్పుడు టీడీపీ నేతలు ఎవరిమీదయినా దాడి చేశారా, లేక వైఎస్ఆర్ విగ్రహాలను టచ్ చేశారా..? అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు సైలెంట్ గా ఉన్న టీడీపీ శ్రేణులు ఇప్పుడు వయొలెంట్ గా ఎందుకు మారాయని అంటున్నారు. అంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ కక్షసాధింపుల వల్లే ఇప్పుడు టీడీపీ కూడా రివర్స్ అటాక్ మొదలు పెట్టిందనేది వారి వాదన. కన్నుకు కన్ను, పన్నుకి పన్ను అనే విధానాన్ని ఎవరూ సమర్థించరు. గతంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నట్టు, ఇప్పుడే తగలబడిపోతున్నట్టు ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నారనేదే టీడీపీ నేతలు అడుగుతున్న ప్రశ్న.

గతంలో స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఎన్ని తలలు పగిలాయి, ఎంత రక్తపాతం జరిగింది. కనీసం నామినేషన్ వేసేందుకు కూడా టీడీపీ నేతలు భయపడిన సందర్భాలున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 2019లో ప్రజా వేదికతో కూల్చివేతలు మొదలయ్యాయని, ఇప్పుడు కొత్తగా వైసీపీ ఆఫీస్ కూల్చివేత గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడుగుతున్నారు. ఇక కేసుల విషయానికొస్తే.. చంద్రబాబుతో సహా అక్రమ కేసులు పెట్టి గతంలో చాలామందిని అరెస్ట్ చేయించారని, ఈవీఎంలు పగలగొట్టిన వీడియోలే సాక్ష్యాలుగా ఉన్న కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేస్తే కక్షసాధింపు అంటారేంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో వైసీపీ మంత్రులు బూతులు తిడుతున్నప్పుడు ప్రవచనాల్లాగా విన్న మేథావులంతా ఇప్పుడు ఆ పార్టీపై సింపతీ చూపిస్తున్నారెందుకని అడుగుతున్నారు.

విధ్వంసం ఆగేదెప్పుడు..?

అసలు విధ్వంసం జరగడంలేదని అంటున్నారు టీడీపీ నేతలు. కానీ సోషల్ మీడియాలో విధ్వంసం తాలూకు ఆనవాళ్లు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ ఐదేళ్లలో మీరు రెచ్చిపోతే 2029లో మా విశ్వరూపం చూస్తారంటూ వైసీపీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. అంటే ఈ విధ్వంసం ఇక్కడితో ఆగేలా లేదు. రాజకీయాలను కేవలం కక్షసాధింపులకే ఉపయోగించుకుంటే మాత్రం భవిష్యత్తులో ఇంకెలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో.

First Published:  30 Jun 2024 7:45 AM GMT
Next Story