జగన్ దూకుడు ..బాబు నాన్చుడు
రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీపై ఆరోపణలు గుప్పిస్తే ఇవే పరిణామాలు తప్పవంటూ స్పష్టమైన సంకేతాలు అందరికీ పంపారు సీఎం జగన్ రెడ్డి.
వైసీపీ అధినేత ఆది నుంచి దూకుడు రాజకీయాన్నే నమ్ముకున్నారు. టిడిపి అధినేత మొదటి నుంచి నాన్చుడు ధోరణితోనే నెట్టుకొస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసమ్మతి స్వరం వినిపిస్తే క్షణాల్లో వేటు వేస్తున్నారు వైఎస్ జగన్. టిడిపి టికెట్ పై గెలిచి పార్టీకి అంటీముట్టనట్టు ఉంటున్న ఎమ్మెల్యేలని కనీసం మందలించే సాహసం చేయడంలేదు చంద్రబాబు.
కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి మరీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. సీబీఐ, ఈడీ కేసులతో వేధించి అరెస్టు చేసినా తగ్గలేదు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా పోరాట బాట వీడలేదు. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు అప్పటి అధికార టిడిపిలో చేరినా ఒక్కరినీ బతిమాలలేదు. నంద్యాల ఉప ఎన్నికలో తన సీటుని టిడిపి గెలుచుకుంటే.. కొట్టారు కొట్టించుకున్నాం..ఇంత కంటే గట్టిగా కొడతామంటూ ధీమాతో బదులిచ్చారు. అధికారంలోకి వచ్చినాక కూడా అదే దూకుడు మెయింటెన్ చేస్తున్నారు. తాజాగా తన పార్టీలో అసమ్మతి గళాలు వినిపిస్తున్న ఏ ఒక్కరినీ బతిమాలే పద్ధతి పెట్టుకోలేదు. ఉంటే ఉండమను, లేకపోతే పొమ్మను అనే స్టైల్‌లో తెగేసి చెబుతున్నారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ప్రభుత్వం పనితీరు బాగాలేదని, అభివృద్ధి శూన్యమంటూ గొంతు ఎత్తారు. వెంటనే ఆ నియోజకవర్గం సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. సెక్యూరిటీ కుదించేశారు. అధికారులకు కూడా సమన్వయకర్తని ఫాలో అవ్వాలంటూ మౌఖిక ఆదేశాలు వెళ్లాయి.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అసమ్మతిగళం వినిపించారు. విపక్ష పార్టీలతో టచ్‌లో ఉండి, సీటు హామీ తీసుకునే వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడి చేశారు. కోటంరెడ్డి బెదిరింపులను కనీసం పరిగణనలోకి తీసుకోని వైసీపీ అధిష్టానం నెల్లూరు రూరల్ బాధ్యతలను ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించింది. కోటంరెడ్డి ఉంటే ఉండు లేదంటే పో అనే సంకేతాలు పంపింది కానీ బతిమాలే పని పెట్టుకోలేదు.
రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీపై ఆరోపణలు గుప్పిస్తే ఇవే పరిణామాలు తప్పవంటూ స్పష్టమైన సంకేతాలు అందరికీ పంపారు సీఎం జగన్ రెడ్డి. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిపై ఆరోపణలు రావడంతో ఇక్కడా వైసీపీ నియోజకవర్గ బాధ్యతలకు సమన్వయకర్తని దింపారు.
తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు నాన్చుడు ధోరణితో నేతలు కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. విశాఖ ఉత్తరం టిడిపి టికెట్ పై గెలిచిన గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ ఆదేశాలేవీ పాటించకుండా తాను సొంతంగా రాజకీయాలు చేసుకుంటున్నారు. గంటాని కనీసం పిలిచి మందలించే సాహసం చేయలేని చంద్రబాబు తీరుపై నేతలు గుర్రుగా ఉన్నారు. అధినేత నాన్చుడు ధోరణితో నేతలకు అలుసైపోతున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.