Telugu Global
Andhra Pradesh

'వంగవీటి' రగడ

రంగా హత్యకేసులో నిందితులైన చాలా మంది టీడీపీలో ఉన్నారని ఆయన ఆరోపించారు. అయితే వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ గాలం వేసే ప్రయత్నం చేస్తోంది.

వంగవీటి రగడ
X

రాష్ట్రంలో మరోసారి దివంగత నేత వంగవీటి రంగా పేరు ప్రధానంగా తెరమీదకు వచ్చింది. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. వంగవీటి పేరును ఏ రాజకీయ పార్టీ అయినా ప్రస్తావించేది కాపుల ఓటు బ్యాంకు కోసమే. వంగవీటి రాధా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అయినప్పటికీ.. కాపుల తరఫు ప్రతినిధిగానే ఆయ‌న మీద ముద్రప‌డింది. టీడీపీ హయాంలో ఆయన హత్య జరగడం.. ఆ పార్టీ ప్రోద్బలంతోనే వంగవీటి హత్య జరిగిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం వంగవీటి కుటుంబ సభ్యులు టీడీపీలో ఉండటం గమనార్హం.

కాగా, నేడు వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా గుడివాడతో పాటు పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన వర్ధంతి సభల్లో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. గుడివాడలో కాపుల బలం ఎక్కువే. వారంతా చాలా ఏళ్లుగా కొడాలి నానికి మద్దతు ఇస్తున్నారు. అయితే నేడు గుడివాడలో టీడీపీ నేతలు వంగవీటి రంగా విగ్రహానికి నివాళి అర్పించడం పట్ల కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగాను చంపింది తెలుగుదేశం హయాంలోనేనని ఆయన ఆరోపించారు. హంతకులు ఆయన విగ్రహానికి దండలు వేయడం ఏమిటని ప్రశ్నించారు.

రంగా హత్యకేసులో నిందితులైన చాలా మంది టీడీపీలో ఉన్నారని ఆయన ఆరోపించారు. అయితే వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ గాలం వేసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే.. జనసేనతో పొత్తుకు కూడా ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అయితే రంగా హత్య విషయం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి.. చంద్రబాబే టార్గెట్ అవుతుంటారు. రంగా హత్యకు బాబు ప్రోద్బలం ఉందని.. గతంలో సీనియర్ నేత హరిరామజోగయ్య కూడా ప్రస్తావించడం గమనార్హం. మరి వచ్చే ఎన్నికల్లో కాపులను తమవైపున‌కు తిప్పుకొనేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. జనసేన ఎలాగూ కాపుల ఓట్ల మీద ఆశలు పెట్టుకున్నది. ఇక మిగిలిన పార్టీలు కూడా తమవంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

First Published:  26 Dec 2022 11:30 AM IST
Next Story