Telugu Global
Andhra Pradesh

టీడీపీకి ఓటు వేశారంటూ ఇబ్బందులు..? రివర్స్ అటాక్

వైసీపీ ప్రభుత్వంలో కార్డుదారులంతా అనేక ప్రయోజనాలు పొంది, చివరకు వైసీపీకి ఓటు వేయకుండా మోసం చేశారంటూ సదరు డీలర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అందుకే లబ్ధిదారులకు రేషన్ సరకులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారట.

టీడీపీకి ఓటు వేశారంటూ ఇబ్బందులు..? రివర్స్ అటాక్
X

ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆ మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు వైసీపీని టార్గెట్ చేశారంటూ వార్తలు వినపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయంటూ సాక్షాత్తూ జగనే సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కట్టుతప్పాయంటూ గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. తలలు పగిలినవారు, ఇంట్లో సామాన్లు ధ్వంసమైనవారు.. అంతా వైసీపీ వాళ్లేననేది బహిరంగ రహస్యం. అయితే ఈ ప్రచారానికి కౌంటర్ గా ఎల్లో మీడియా మరికొన్ని వార్తల్ని వెదికి పట్టుకుంటోంది. టీడీపీకి ఓటు వేశారంటూ కొంతమందిని వైసీపీ నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కథనాలిస్తోంది.

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లిలో రేషన్‌ డీలర్ టీడీపీ సానుభూతిపరులను ఇబ్బంది పెట్టారనేది ఎల్లో మీడియా కథనం. ఈ గ్రామంలో రెండు చౌకధరల దుకాణాలు ఉన్నాయని, అందులో ఒకదానికి వైసీపీ నాయకుడు డీలర్ గా వ్యవహరిస్తున్నాడని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కార్డుదారులంతా అనేక ప్రయోజనాలు పొంది, చివరకు వైసీపీకి ఓటు వేయకుండా మోసం చేశారంటూ సదరు డీలర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అందుకే లబ్ధిదారులకు రేషన్ సరకులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారట. రేషన్ సరకులకోసం లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారని, ప్రతీకార రాజకీయాలకు బలవుతున్నారంటూ సానుభూతి కథనాలిస్తోంది ఎల్లో మీడియా. ఇక్కడ టీడీపీ కార్యకర్తల్ని, అభిమానుల్ని బాధితులుగా చూపించే ప్రయత్నం చేస్తోంది.

జగన్ హయాంలో రేషన్ కార్డుదారులు నేరుగా ఇంటివద్దే సరుకులు తీసుకుంటున్నారు. రేషన్ వాహనం ఆయా ప్రాంతాలకు వచ్చినప్పుడు ఎండీయూ ఆపరేటర్ సరుకులు ఇస్తారు. రేషన్ డీలర్ తో ఇక్కడ పెద్దగా పని ఉండదు. అంటే టీడీపీ సానుభూతిపరుల్ని రేషన్ డీలర్ గా ఉన్న వైసీపీ నాయకుడు ఇబ్బంది పెడుతున్నారనేది అవాస్తవం. అయితే ఏపీలో జరుగుతున్న రాజకీయ ప్రతీకార దాడులకు కొత్త రంగు వేయాలనుకుంటోంది ఎల్లో మీడియా. బాధితులు కేవలం వైసీపీ వాళ్లే కాదని, టీడీపీనుంచి కూడా ఉన్నారని నిరూపించాలనుకుంటోంది. ఆ ప్రయత్నమే ఇది.

First Published:  10 Jun 2024 3:17 AM GMT
Next Story