హరీష్ వ్యాఖ్యలతో ఏపీ ప్రతిపక్షాల్లో జోష్..
మాట తప్పను, మడమ తిప్పను అంటూ గత ఎన్నికల వేళ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు మడమ తిప్పారని ప్రశ్నించారు సీపీఐ రామకృష్ణ. హరీష్ రావు వేసిన ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు.
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాజకీయాలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఎక్కడిరాజకీయాలక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడివారిపై అక్కడి నేతలు విమర్శలు చేయడం, అక్కడి విధానాలపై ఇక్కడ చర్చ జరగడం చాలా అరుదు. అయితే ఇటీవల తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఏపీలోని మంత్రులు, మాజీ మంత్రులు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. హరీష్ వ్యాఖ్యలకు కౌంటర్లివ్వడంలో పోటీ పడుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంటోంది. ఏపీలోని ప్రతిపక్షాల్లో హరీష్ వ్యాఖ్యలు జోష్ నింపాయి. ఉన్నమాటంటే ఉలుకెందుకంటూ అధికార వైసీపీపై మండిపడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్.. హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించారు, వైసీపీ నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తాజాగా సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కూడా తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు ఏపీ సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు ఎందుకు ఆచరించలేదని ప్రశ్నించారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామన్న విషయం ఏమైందని నిదీశారు. విభజన చట్టంలోని హామీల అమలు, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి నిధుల సంగతేమైందన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోయారన్నారు.
మాట తప్పారు, మడమ తిప్పారు..
మాట తప్పను, మడమ తిప్పను అంటూ గత ఎన్నికల వేళ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు మడమ తిప్పారని ప్రశ్నించారు సీపీఐ రామకృష్ణ. నాలుగేళ్లలో ఆయన ఏం సాధించారన్నారు. హరీష్ రావు వేసిన ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు.
వైసీపీ సెల్ఫ్ గోల్..
అటు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టయింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందంటూ కేంద్ర సహాయ మంత్రి ప్రకటించిన తర్వాత పవన్ కల్యాణ్ సహా తెలంగాణ నేతలు కూడా తమ ఒత్తిడి ఫలించిందన్నారు. అయితే కేంద్రం వెంటనే మాట మార్చింది. దీంతో వైసీపీ రెచ్చిపోయింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని, అది తమ గొప్పేనని చెప్పుకున్నారు కదా ఇప్పుడేమంటారు అని ప్రశ్నించారు పేర్ని నాని.
కేంద్రాన్ని నిలదీయండి, ప్రశ్నించండి అంటూ సుద్దులు చెప్పారు. అసలు కేంద్రాన్ని ప్రశ్నించాల్సింది ఎవరు..? నిలదీయాల్సింది ఎవరు..? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకోసం గట్టిగా పోరాడాల్సింది ఎవరు..? ఏపీలో అధికారంలో తామే ఉన్నామన్న విషయం మరచిపోయి.. స్టీల్ ప్లాంట్ కోసం జనసేన, బీఆర్ఎస్ పోరాటం చేయాలంటూ సెటైర్లు వేశారు పేర్ని నాని. హరీష్ వ్యాఖ్యలకు కౌంటర్లిచ్చే విషయంలో వైసీపీ లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటోంది. తమ వైఫల్యాలను తామే బయటపెట్టుకుంటోంది. ప్రతిపక్షాలకు మరోసారి బుక్కైంది.