Telugu Global
Andhra Pradesh

పోలవరం కోసమైనా నన్ను సీఎం చేయండి.. బాబు వింత అభ్యర్థన..

విలీన మండలాలను జిల్లాగా చేస్తానని ప్రకటించిన బాబు, తాజాగా మరో హామీ ఇచ్చారు. తనకు అధికారం ఇస్తే ఈసారి పోలవరం గ్యారెంటీ అన్నారు.

పోలవరం కోసమైనా నన్ను సీఎం చేయండి.. బాబు వింత అభ్యర్థన..
X

గోదావరి వరదల అనంతరం పోలవరం ముంపు మండలాల్లో పర్యటిస్తున్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. తనకి అపూర్వ ఆదరణ దక్కిందని, ప్రజలంతా తనకోసం ఎదురు చూస్తున్నారని, ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా జెండా ఎగరేస్తామంటూ బీరాలు పలుకుతున్నారు. అంతే కాదు విలీన మండలాలకోసం ఎడా పెడా వాగ్దానాలు ఇచ్చేస్తున్నారు. తాను సీఎంగా ఉండగా చేయలేని పనులన్నీ మరోసారి అధికారంలోకి వస్తే చేస్తానంటూ చెబుతున్నారు. విలీన మండలాలను జిల్లాగా చేస్తానని ప్రకటించిన బాబు, తాజాగా మరో హామీ ఇచ్చారు. తనకు అధికారం ఇస్తే ఈసారి పోలవరం గ్యారెంటీ అన్నారు.

ఈసారి చేసేస్తా..

2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. పోలవరం విషయంలో ఐదేళ్లు నాన్చింది కానీ పూర్తి కాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా కాలంలో కూడా పనులు ముమ్మరంగా జరిగాయి. చివరికిప్పుడు డయాఫ్రం వాల్ దగ్గర పీటముడి పడింది. దీన్ని కవర్ చేసుకోడానికి తికమక పడుతున్నారు చంద్రబాబు. పోలవరం తాను 90శాతం పూర్తి చేశానని, ఆ 10శాతం పనులు వైసీపీ ప్రభుత్వం చేయలేకపోతోందని అంటున్నారు. అంతే కాదు ఈసారి అధికారం ఇస్తే పోలవరం మొత్తం పూర్తి చేస్తానని నమ్మబలుకుతున్నారు.

పోలవరం కోసం రాజీనామాలు..

పోలవరం కోసం కేంద్రం నిధులివ్వడంలేదని చెబుతున్న వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు. ఈ విషయంలో కూడా బాబుకి కౌంటర్లు బాగానే పడుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం అప్పట్లో చంద్రబాబు టీడీపీ ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. పోలవరం కట్టడం చేతకాని బాబు, ఇప్పుడు ప్రాజెక్ట్ కడతాను, అధికారం ఇవ్వండి అని అడగడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. అసలు ముంపు మండలాల్లో పర్యటించే అర్హత చంద్రబాబుకి లేదన్నారు. వరదల్లో బురద రాజకీయం చేస్తున్నారని, తమ ప్రభుత్వం పరిహారం కూడా పంపిణీ చేశాక, చంద్రబాబు మళ్లీ వెళ్లి రెచ్చగొడుతున్నారని విమర్శిస్తున్నారు. మొత్తమ్మీద విలీన మండలాల్లో చంద్రబాబు హామీలు, అభ్యర్థనలు కాస్త వింతగా, విచిత్రంగా తోస్తున్నాయి.

First Published:  30 July 2022 2:03 AM
Next Story