పెన్షనర్లకు తప్పని తిప్పలు.. జూన్ నెల పెన్షన్లూ బ్యాంకు ఖాతాల్లోనే..
రాష్ట్రంలోని సామాజిక పెన్షనర్లలో 47.74 లక్షల మందికి వారి బ్యాంకు అకౌంట్లోనే పెన్షన్ జమ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈరోజు చెప్పారు
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పింఛనుదార్లకు మరోమారు అగచాట్లు తప్పవు. ఒకటో తేదీ తెల్లవారకముందే వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్ అందించే సౌకర్యం గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సాగింది. దాన్ని ఎలాగైనా చెడగొట్టి, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలన్న టీడీపీ, దాని అనుబంధ వ్యవస్థల ప్రయత్నాలతో పింఛనుదార్లు రెండు నెలలుగా నరకం చూస్తున్నారు. వచ్చే 1వ తారీఖు (జూన్ 1)న కూడా పెన్షన్లు బ్యాంకు ఖాతాల్లోనే వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
47.74 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లలోనే..
రాష్ట్రంలోని సామాజిక పెన్షనర్లలో 47.74 లక్షల మందికి వారి బ్యాంకు అకౌంట్లోనే పెన్షన్ జమ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈరోజు చెప్పారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో లేవలేని మరో 17. 56 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటి దగ్గరే అందిస్తామని చెప్పారు. వీరికి జూన్ 1 నుంచి 6వ తేదీ లోపు ఇంటి వద్ద పింఛన్ అందిస్తామని వివరించారు.
రోహిణీకార్తె ఎండల్లో నరకం
వాలంటీర్లు పెన్షన్ ఇంటికి తెచ్చి ఇస్తే ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వానికి మంచి పేరొచ్చేస్తుందని టీడీపీ అభిమాన సంఘాల వారు నానా యాగీ చేసి, ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి మరీ వాలంటీర్లను పక్కనపెట్టించారు. ఇంటింటికీ తీసుకెళ్లి ఇవ్వడానికి సరిపడా సిబ్బంది లేక ఏప్రిల్ నెలలో గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ పెన్షనర్లను తిప్పారు. మే నెలలో బ్యాంకు ఖాతాల్లో వేశారు. దీంతో పెన్షనర్లు బ్యాంకుల దగ్గర బారులతీరారు. ఈనెల కూడా బ్యాంకుల్లోనే వేస్తామని ప్రకటించారు. దీంతో లబ్ధిదారులు.. గూబ గుయ్యిమనిపించే రోహిణీ కార్తె ఎండల్లో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన ఖర్మ కొనసాగనుంది.