Telugu Global
Andhra Pradesh

మంత్రుల ప్రెస్ మీట్లు.. మార్పు మొదలైందని చెప్పేందుకేనా..?

మంత్రుల ప్రెస్ మీట్లు, హడావిడి చూస్తుంటే.. గతంలో పరిస్థితులు ఇలా లేవు, ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి అని చెప్పేందుకు వారు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

మంత్రుల ప్రెస్ మీట్లు.. మార్పు మొదలైందని చెప్పేందుకేనా..?
X

ఏపీలో బాధ్యతలు చేపట్టిన మంత్రులంతా వరుస ప్రెస్ మీట్లతో హడావిడి చేస్తున్నారు. ఆయా శాఖలకు చెందిన వివరాలు వెల్లడిస్తూ, గతంలో ఏవేవో అక్రమాలు జరిగాయని వాటన్నిటినీ సెట్ రైట్ చేస్తామని అంటున్నారు. హోం మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత తాజా ప్రెస్ మీట్ లో తన సుదీర్ఘ కార్యాచరణ ప్రకటించారు. లా అండ్ ఆర్డర్ ని మెరుగుపరుస్తామని, మహిళలపై దాడుల్ని అరికడతామని, పోలీస్ స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపరుస్తామని, గంజాయిపై యుద్ధం ప్రకటిస్తామని ఆమె చెప్పారు.

ముఖ్యంగా గంజాయి విషయంలో గతంలో జరిగిందేంటి..? ఇప్పుడు తాము చేయబోతున్నదేంటి..? అనే వివరాలను వెల్లడించారు హోం మంత్రి అనిత. మూడు నెలల్లో గంజాయి రవాణా తగ్గించి మార్పు తెస్తామని హామీ ఇచ్చారు. గంజాయిపై సమాచారం ఇచ్చిన వారికి నగదు ప్రోత్సాహం కూడా ఇస్తామన్నారు. ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటిస్తామన్నారు. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తామన్నారు. విశాఖ డ్రగ్స్ కంటైనర్ విషయంలో పూర్తి స్థాయి విచారణ చేపడతామన్నారు అనిత.

మంత్రుల ప్రెస్ మీట్లు, హడావిడి చూస్తుంటే.. గతంలో పరిస్థితులు ఇలా లేవు, ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి అని చెప్పేందుకు వారు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో మంత్రులుగా ఉన్నవారిలో సీనియర్లు మినహా మిగతావారెవరూ తరచూ ప్రెస్ మీట్లు పెట్టి ఎరగరు. ఇద్దరు మహిళలు హోం మంత్రులుగా ఉన్నా కూడా వారు మీడియా ముందుకు రావడం చాలా అరుదు. ఏపీలో అల్లర్లు జరిగినప్పుడు, మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు మాత్రమే వివరణలు ఇచ్చేందుకు వారు మీడియా ముందుకొచ్చేవారు. అయితే ఆ పరిస్థితి టీడీపీ హయాంలో లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనిత. బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తానని తెలిపారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇదంతా కేవలం మీడియా ముందు హడావిడేనా.. నిజంగానే అనిత తన డిపార్ట్ మెంట్ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోగలరా? చంద్రబాబు ఆ స్వాతంత్రం మంత్రులకు ఇస్తారా..? ముందు ముందు తేలిపోతుంది.

First Published:  18 Jun 2024 7:02 AM IST
Next Story