ఉద్యోగుల్లో అసంతృప్తి..? జగన్ కు ఎమ్మెల్సీ ఎన్నికల లిట్మస్ టెస్ట్
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడటం లేదనే ఆరోపణలున్నాయి. సీపీఎస్ రద్దు సహా ఇతర సమస్యలున్నాయి. మరి వారిలో ఉన్న అసంతృప్తి ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందో లేదో చూడాలి.
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అధికారికంగా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు సీఎం జగన్. ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లతో జరిగిన రివ్యూ మీటింగ్ లో జగన్ ఐదుగురు అభ్యర్థులను పరిచయం చేశారు. వారి గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లదేనని తేల్చి చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర ముందు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జగన్ ప్రభుత్వ పనితీరుకి గీటురాయి అని చెప్పుకోవచ్చేమో.
ఏపీలో మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో 8 స్థానాలు స్థానిక సంస్థలవి. ఇందులో వైసీపీకి తిరుగులేదు. గెలుపుపై అనుమానం అస్సలు లేదు. రాగా పోగా మిగతా ఐదు స్థానాలకోసం వైసీపీ అభ్యర్థులు చెమటోడుస్తున్నారు. వాస్తవానికి ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థుల విజయం ఆనవాయితీ. గతంలో కూడా అధికార పార్టీలు ప్రయత్నించినా ప్రతిపక్షాల మద్దతుతో పీడీఎఫ్ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించేవారు. కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ అభ్యర్థుల్ని కూడా ప్రకటించేది కాదు. ప్రతిపక్షంలో ఉండగా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ కి మద్దతు తెలిపిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక సొంతగా అభ్యర్థులను బరిలో దింపుతోంది.
ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎస్.సుధాకర్, తూర్పు రాయలసీమ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పేర్నాటి శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, పశ్చిమ రాయలసీమ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి , తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్ధానానికి ఎం.వి.రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారని ప్రకటించిన జగన్ వారి గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించారు.
ఉద్యోగుల్లో అసంతృప్తి..
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడటం లేదనే ఆరోపణలున్నాయి. సీపీఎస్ రద్దు సహా ఇతర సమస్యలున్నాయి. మరి వారిలో ఉన్న అసంతృప్తి ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందో లేదో చూడాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల ఓట్లపై వైసీపీ నమ్మకం పెట్టుకుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల విషయంలో ఈ దఫా ప్రైవేట్ ఉపాధ్యాయుల ఓట్లు తమను గట్టెక్కిస్తాయని అనుకుంటోంది. అయితే అంతకు మించి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత ఎన్నికల ఫలితాల్లో కనపడితే మాత్రం జగన్ ఒక్కసారి తన పాలనను సమీక్షించుకోవాల్సిన పరిస్థితి.
ఇప్పటి వరకూ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అంటున్నారు జగన్. ఉద్యోగులు, ఉపాధ్యాయులెవరికీ సంక్షేమ పథకాలు అందవు. అంటే ఒకరకంగా సంక్షేమ పథకాలు అందనివారు ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. గ్రాడ్యుయేట్లలో ఉద్యోగాలు రానివారు ఉన్నా కూడా వారి శాతం చాలా తక్కువ. సో.. ఉద్యోగులు వర్సెస్ జగన్ అన్నట్టుగా ఐదు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఉద్యోగ సంఘాలన్నీ జగన్ కే మద్దతు అంటూ ఇటీవల కొంతమంది సభలు, సమావేశాలు పెట్టి జగన్ ఫొటోలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఆ పాలాభిషేకాల్లో, వారు చూపిస్తున్న అభిమానంలో వాస్తవం ఎంతనేది కూడా ఈ ఎన్నికలతో తేలిపోతుంది.