Telugu Global
Andhra Pradesh

ఏ డిగ్రీ చదివావమ్మా..? టెన్త్ సార్..

డిగ్రీ అంటే ఏంటో కూడా తెలియని మహిళ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరుగా పేరు నమోదు చేయించుకోగలిగింది, ఆమెకు ఓటు కూడా వచ్చింది.

ఏ డిగ్రీ చదివావమ్మా..? టెన్త్ సార్..
X

ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. టెన్త్ ఫెయిలైనవాళ్లు కూడా పట్టభద్రుల నియోజకవర్గానికి ఓటర్లుగా మారారు, టీ కొట్టులో పనిచేసేవాళ్లు కొన్నిచోట్ల ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. తిరుపతిలో ఒకే ఇంటిలో 17 మంది ఓటర్లు ఉన్నట్టు కూడా వార్తలొచ్చాయి. ఇవన్నీ వట్టి పుకార్లే అనుకున్నా, పోలింగ్ రోజు జరిగిన ఘటనలు మాత్రం ఈ విమర్శలు నిజమేననడానికి రుజువులుగా మారాయి.

తూర్పు రాయలసీమ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే తిరుపతిలో దొంగ ఓటర్లు ధైర్యంగా దర్జాగా పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తున్నారు. పెద్దగా చదువుకోని వ్యక్తిగా కనిపించిన ఓ మహిళను మీడియా రిపోర్టర్లు ఏ డిగ్రీ చదివావమ్మా అని అడిగారు. కాసేపు తటపటాయించిన ఆమె.. టెన్త్ సార్ అని జవాబిచ్చింది. డిగ్రీ అంటే ఏంటో కూడా తెలియని మహిళ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరుగా పేరు నమోదు చేయించుకోగలిగింది, ఆమెకు ఓటు కూడా వచ్చింది. ఇక అక్కడి అధికార యంత్రాంగం పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

విచిత్రం ఏంటంటే విజయ అనే పేరుతో ఓటు వేయడానికి వచ్చిన మహిళ తమిళనాడు వాసి. ఏపీలో ఆమెకు ఓటు హక్కు ఇప్పించారు, టెన్త్ క్లాస్ ఫెయిలైన ఆమెకు డిగ్రీ చదివినట్టు ఓటు పుట్టించారు. తమ గ్రామ వాలంటీర్ తనకు ఓటరు స్లిప్పు ఇచ్చినట్టు చెబుతోంది విజయ. వాలంటీర్లను పోలింగ్ విధులకు దూరంగా ఉంచాలని కోర్టులు మొత్తుకుంటున్నా క్షేత్ర స్థాయిలో పనులన్నీ వారి చేతులమీదుగానే జరుగుతున్నాయి. ఇక దొంగ ఓట్ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంత జరిగినా సదరు విజయ అనే మహిళ పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు వేసి రావడం గమనార్హం.


విజయ వీడియోతో సహా దొరికిన ఉదాహరణ. ఇలాంటివారు ఇంకా చాలామందే ఉన్నారు. టీచర్ల నియోజకవర్గంలో ఓటర్లుగా ఈసారి ప్రైవేట్ టీచర్లకు అనుమతివ్వడంతో చాలామంది ఇతర వృత్తుల్లో ఉన్నవారికి కూడా ఓటు హక్కు పుట్టుకొచ్చింది. వైసీపీ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై ఎన్నికల కమిషన్ కి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

First Published:  13 March 2023 3:23 PM IST
Next Story