Telugu Global
Andhra Pradesh

టీచర్లు జగన్ కి జై కొడతారా..? తేలేది నేడే..

తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ బలపరచిన అభ్యర్థులు గెలిస్తే మాత్రం కచ్చితంగా ప్రభుత్వానికి తిరుగు లేదని చెప్పాలి. ఒకరకంగా సీపీఎస్ రద్దు విషయంలో కూడా టీచర్లు వెనక్కి తగ్గినట్టే లెక్క.

టీచర్లు జగన్ కి జై కొడతారా..? తేలేది నేడే..
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగా జరిగిన ఎమ్మల్సీ ఎన్నికల ఫలితాలు నేడే విడుదలవుతాయి. ఈ ఫలితాలపై వైసీపీ గట్టి ఆశలే పెట్టుకుంది. సమాజంలో అన్నివర్గాల వారు తమకి అనుకూలంగా ఉన్నారని చెప్పుకుంటున్న వైసీపీ, ఉపాధ్యాయుల మద్దతుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే అంతకు మించిన విజయం మరొకటి ఉండదు. పట్టభద్రుల విషయానికొస్తే సచివాలయాల ఉద్యోగులు, గ్రాడ్యుయేట్ వాలంటీర్లు.. ఇలా వైసీపీకి చాలామంది మద్దతు ఉంది. ప్రతిపక్షం ఆరోపించినట్టు దొంగఓట్ల గోల ఉండనే ఉంది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించినా పూర్తిగా అందరి మద్దతు ఆ పార్టీకి ఉందని భావించలేం. ఉపాధ్యాయుల నియోజకవర్గంలో దొంగఓట్లకు పెద్దగా ఆస్కారం లేదు. ప్రైవేట్ టీచర్ల ఓట్లు నామమాత్రమే. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఓటు ఎటువైపు అనేదే ప్రశ్నార్థకం.

అసంతృప్తి ఉందా..?

సీపీఎస్ రద్దు సహా, పీఆర్సీ కేటాయింపుల్లో చిన్నచూపు, మొండిబకాయిలు, డీఎస్సీ నియామకాలు లేకపోవడం, పనిభారం పెరిగిపోవడం, హాజరు యాప్ లతో ఉన్న అసంతృప్తి.. ఇవన్నీ ఈ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశముంది. టీచర్లకు రాకరాక వచ్చిన ఛాన్స్, అది కూడా సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు వచ్చిన ఛాన్స్. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం కళ్లు తెరిపిస్తే చాలు, ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు అనేది కొందరి వాదన. ఆ వాదన నిజమవ్వాలంటే ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులు గెలవాలి. మొత్తం ఐదు స్థానాల్లో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. మిగతా మూడు పట్టభద్రుల స్థానాలు. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు బలపరచిన టీచర్ అభ్యర్థులు గెలిస్తే అది జగన్ కి కనువిప్పు అవుతుందనే వాదన బలంగా వినపడుతోంది.

జగన్ కి జై కొడతారా..?

తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ బలపరచిన అభ్యర్థులు గెలిస్తే మాత్రం కచ్చితంగా ప్రభుత్వానికి తిరుగు లేదని చెప్పాలి. ఒకరకంగా సీపీఎస్ రద్దు విషయంలో కూడా టీచర్లు వెనక్కి తగ్గినట్టే లెక్క. పీఆర్సీ వ్యవహారంలో కూడా మీ దయ, మా ప్రాప్తం అని పరోక్షంగా ఒప్పుకున్నట్టే. ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల్లో.. ప్రభుత్వం కూడా ఈ విజయాన్ని చూపించి బేరాలాడే అవకాశముంది. మొత్తమ్మీద టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఏపీలో కీలక చర్చకు తెరతీసే అవకాశముంది.

First Published:  16 March 2023 7:57 AM IST
Next Story