మంత్రుల కంటతడి.. నిన్న అమర్నాథ్, నేడు వనిత
వైసీపీలో నియోజకర్గాలు ఎవరికీ శాశ్వతం కాదు అనే విషయం అర్థమైంది. నియోజకవర్గం పోతే పోయింది, కనీసం వైసీపీ టికెట్ వస్తే చాలు అని చాలామంది అనుకోవడం విశేషం.
నియోజకవర్గాలతో ఎమ్మెల్యేలకు అవినాభావ సంబంధ ఉంటుంది. అందులోనూ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలలో వారు అప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటారు, మరోసారి అక్కడ పోటీ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం ఏపీలో అందులోనూ వైసీపీలో విచిత్రమైన పరిస్థితులున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఖరికి ఉప ముఖ్యమంత్రికి సైతం స్థాన చలనాలు తప్పడంలేదు. ఈ క్రమంలో పక్క నియోజకవర్గాలకు వెళ్లాలంటూ సీఎం ఆదేశాలు అందినవారు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇన్నాళ్లు తమదే అనుకున్న నియోజకవర్గం, అక్కడి ప్రజలు, స్థానిక నేతలు, కార్యకర్తల్ని వదిలి వెళ్లాలంటే బాధపడుతున్నారు. చివరిసారిగా ఆయా నియోజకవర్గాల్లో సమావేశాలు పెడుతున్న నేతలు వేదికపైనే కంటతడి పెట్టడం విశేషం. తాజాగా హోం మంత్రి తానేటి వనిత కొవ్వూరులో జరిగిన మీటింగ్ లో కన్నీటిపర్యంతం అయ్యారు.
ప్రస్తుతం కొవ్వూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హోం మంత్రి తానేటి వనితను 2024 ఎన్నికల కోసం గోపాలపురం నియోజకవర్గానికి మార్చారు. దీంతో ఆమె చివరిసారిగా కొవ్వూరులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మరీ కన్నీళ్లు పెట్టుకున్నారు. కొవ్వూరు నియోజకవర్గం వదిలి వెళ్లటం ఎంతో బాధగా ఉందని అన్నారామె. ఈ క్రమంలో ఆమెకు స్థానచలనం కలిగించడంపై కొందరు కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు రాజీనామా చేస్తాననడంతో.. ఆమె నచ్చజెప్పారు. ప్రస్తుత ఇన్ చార్జ్ గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును నియోజకవర్గ నాయకులు అందరూ ఆదరించాలన్నారు. ఆయన గెలుపుకోసం కృషి చేయాలని చెప్పారు మంత్రి తానేటి వనిత.
ఆమధ్య అమర్నాథ్..
2024 ఎన్నికలకోసం సమాయత్తమవుతున్న వైసీపీ ఇటీవల వరుసగా లిస్ట్ లు విడుదల చేస్తోంది. ఆమధ్య మంత్రి గుడివాడ అమర్నాథ్ కి కూడా ఇలాగే నియోజకవర్గం మిస్సైంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గానికి మలసాల భరత్ కుమార్‌ను ఇన్ చార్జ్ గా ప్రకటించారు. భరత్ కుమార్ పరిచయ సమావేశంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ భావోద్వేగానికి లోనయ్యారు. నియోజకవర్గం విడిచి వెళ్తున్నందుకు ఆయన కంటతడి పెట్టారు.
మొత్తానికి వైసీపీలో నియోజకర్గాలు ఎవరికీ శాశ్వతం కాదు అనే విషయం అర్థమైంది. నియోజకవర్గం పోతే పోయింది, కనీసం వైసీపీ టికెట్ వస్తే చాలు అని చాలామంది అనుకోవడం విశేషం. నియోజకవర్గాలు కోల్పోతున్నవారు మాత్రం తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.