ప్యాకేజీ స్టార్.. ఇప్పుడే నిద్రలేచావా? - మంత్రులు అంబటి, అమర్నాథ్, రోజా కౌంటర్లు
‘రోజుకో వేషం పూటకో మాట మాట్లాడితే ప్రజలు హర్షించరు. పవన్ కల్యాణ్ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. 26 గ్రామాల ప్రజల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు తమ జీవితాలను ఫణంగా పెట్టాలా?
వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖపట్నంలో విశాఖ గర్జన సభ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ సభకు భారీగా ప్రజలు తరలిరావాలని ఇప్పటికే మంత్రులు పిలుపునిస్తున్నారు. కాగా ఈ గర్జన సభపై జనసేనాని పవన్ కల్యాణ్ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. దేనికి గర్జనలు అంటూ ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
ఈ ట్వీట్లపై మంత్రులు అంబటి రాంబాబు, రోజా, అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. 'ప్యాకేజీ స్టార్.. కుంభకర్ణుడిలా నిద్రపోయి ఇప్పుడే లేచావా? ఈ గర్జనల గొడవ నీకెందుకు? ప్యాకేజీ కోసం మొరిగే వాళ్లకు గర్జనలు ఏం అర్థమవుతాయి' అంటూ మంత్రులు కౌంటర్లు ఇచ్చారు.
మంత్రి రోజా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. 'రోజుకో వేషం పూటకో మాట మాట్లాడితే ప్రజలు హర్షించరు. పవన్ కల్యాణ్ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. 26 గ్రామాల ప్రజల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు తమ జీవితాలను ఫణంగా పెట్టాలా? ఆ 26 గ్రామాల్లో మాత్రమే రైతులు ఉన్నారా? మిగిలిన గ్రామాల్లో లేరా? పాదయాత్ర చేస్తున్నది రైతులా? లేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా? ఉత్తరాంధ్ర వలసలపై పవన్ కల్యాణ్ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. గతంలో తెలుగుదేశం, బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడు ఆయనకు ఉత్తరాంధ్ర వలసలు గుర్తుకురాలేదా?' అంటూ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు.
దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కు త్రీ క్యాపిటల్స్.. అంతర్జాతీయ రాజధాని మాస్కో, జాతీయ రాజధాని ముంబై, పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అని మంత్రి అమర్నాథ్ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేయగా.. ప్యాకేజీ కోసం మొరిగే వాళ్ళకి గర్జన అర్థమవుతుందా? అని మరో మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.