సినీ ఇండస్ట్రీకి మంత్రి విడదల రజిని..! - కోడై కూస్తున్న సోషల్ మీడియా
ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్న విడదల రజిని.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీపై కన్నేసినట్టు తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్‌లోకి వచ్చిన విడదల రజిని.. నెక్స్ట్ స్టెప్ సినీ ఇండస్ట్రీ వైపు వేస్తున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారా..? నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించబోతున్నారా..? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. ఏపీ రాజకీయాల్లో వైసీపీలో అడుగు పెడుతూనే చిలకలూరిపేట ఎమ్మెల్యే సీటు సాధించడమేగాక.. ఆపై జగన్‌కు లభించిన అశేష ప్రజాదరణలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపు గుర్రమెక్కిన ఆమె.. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలోనూ జగన్ వల్లెవేస్తున్న బీసీ మంత్రం పుణ్యమా అని.. మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు.
ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్న విడదల రజిని.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీపై కన్నేసినట్టు తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్‌లోకి వచ్చిన విడదల రజిని.. నెక్స్ట్ స్టెప్ సినీ ఇండస్ట్రీ వైపు వేస్తున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. సినీ రంగంలో నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించాలనే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ అంశం ఏపీ రాజకీయాల్లోనూ, ఆమె నియోజకవర్గ ప్రజలు, అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
మరోపక్క తమ అభిమాన నాయకురాలు సినిమా రంగంలోకి వెళితే మంచిదేనని, ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీ నిర్మాతగా కూడా రాణించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ పుకార్లకు మరింత మసాలా దట్టిస్తూ నేరుగా ఆమె సినిమాల్లో నటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది.
ఇప్పుడు ఈ వార్తలు ఆమె కేడర్‌లోను, సామాన్య ప్రజల్లోనూ గందరగోళానికి కారణమయ్యాయి. ఈ విషయం ఆనోటా ఈనోటా చివరికి మంత్రి విడదల రజిని వద్దకే చేరింది. దీంతో షాకవ్వడం ఆమె వంతయింది. తనకు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లే ఆలోచనే లేకపోగా.. ఏకంగా సినిమాలే తీసేస్తానని ప్రచారం జరుగుతుండటంపై ఆమె విస్తుపోయారట. నెమ్మదిగా ఈ విషయం ఎవరు ప్రచారం చేస్తున్నారనే విషయం ఆరాతీయగా, తన రాజకీయ ప్రత్యర్థులే దీనికి కారణమని గుర్తించారట. ఈ సినిమాల ప్రచారంతో తన పొలిటికల్ కెరీర్‌కి నష్టం జరిగేలా ఉండటంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మహిళా మంత్రి.. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టారు. సినిమా రంగంలోకి వెళ్లాలన్న ఆలోచన కూడా తనకు లేదని తేల్చి చెప్పారు. ప్రజా సేవలో తాను బిజీగా ఉన్నానని, మంచి నాయకురాలిగా ప్రజల మన్ననలు పొందడమే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. దీంతో ఈ ప్రచారానికి ఇంతటితో చెక్ పెట్టినట్టయింది.