Telugu Global
Andhra Pradesh

రామోజీది నల్ల సిరా కాదు.. ఎల్లో సిరా.. - మంత్రి చెల్లుబోయిన ఆగ్రహం

వృద్ధుల ఇంటికి వెళ్లి ప్ర‌తి నెలా 1వ‌ తేదీన పెన్షన్ ఇస్తుంటే రామోజీరావుకు కనిపించడం లేదా? కరోనా కాలంలో వలంటీర్ వ్యవస్థ చేసిన సేవలు రాసేందుకు చేతులు రాలేదా?

రామోజీది నల్ల సిరా కాదు.. ఎల్లో సిరా.. - మంత్రి చెల్లుబోయిన ఆగ్రహం
X

గ్రామ వలంటీర్ల వ్యవస్థపై ఎల్లో మీడియాలో విషపు రాతలు రాస్తున్నారని ఏపీ స‌మాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మేలు చేసేందుకే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు వలంటీర్ వ్యవస్థను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

టీడీపీ తీసుకొచ్చిన జన్మభూమి కమిటీల మాదిరిగా ప్రజల్ని జలగల్లా పీడించడం కాదని.. ప్రజలకు సేవ చేసేందుకే గ్రామ వలంటీర్ వ్యవస్థ అని మంత్రి చెప్పారు. సేవే పరమావధిగా గ్రామ వలంటీర్ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని గుర్తుచేశారు.

వలంటీర్ సేవలపై రాసేందుకు చేతులు రావట్లేదా..?

కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా కేవలం అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించాలనే సంకల్పంతో వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. వృద్ధుల ఇంటికి వెళ్లి ప్ర‌తి నెలా 1వ‌ తేదీన పెన్షన్ ఇస్తుంటే రామోజీరావుకు కనిపించడం లేదా? కరోనా కాలంలో వలంటీర్ వ్యవస్థ చేసిన సేవలు రాసేందుకు చేతులు రాలేదా? లంచాలకు తావులేకుండా ప్రజలకు సేవ చేస్తుంటే.. దేశవ్యాప్తంగా వలంటీర్ వ్యవస్థను మెచ్చుకుంటుంటే.. రామోజీరావు కళ్లుండి కూడా చూడలేకపోతున్నారని మంత్రి చెల్లుబోయిన విమర్శలు గుప్పించారు.

జన్మభూమి కమిటీల దోపిడీలపై ఈనాడు ఎందుకు ప్రశ్నించలేదు?

రామోజీరావు ఎజెండా టీడీపీకి మేలు చేయడమేనని.. ఈనాడు కాస్త చంద్రనాడుగా మారిందా అని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ పాలనలో ఏ ప్రభుత్వ పథకం దక్కాలన్నా.. జన్మభూమి కమిటీలు పేదవాడిని లంచాలతో దోచేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు జన్మభూమి కమిటీల దోపిడీలపై ఈనాడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్‌లో కర్త, కర్మ, క్రియ రామోజీరావేనని.. ఆరోజు రాసిన రాతలు మార్చిపోయారా అంటూ మంత్రి చెల్లుబోయిన చురకలంటించారు.

First Published:  19 Jan 2023 8:48 PM IST
Next Story