Telugu Global
Andhra Pradesh

వైరల్ అవుతున్న మహిళా మంత్రి వీడియో

కల్యాణ దుర్గంలోని మంత్రి కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మంత్రి ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారు.

వైరల్ అవుతున్న మహిళా మంత్రి వీడియో
X

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ఈసారి అధికార పార్టీ మరింత సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా, గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పగించారు సీఎం జగన్. ఈ క్రమంలో వైసీపీ నేతలు తమ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచార పర్వంలో పాల్గొనారు. ప్రలోభ పర్వంలో కూడా వారు చురుగ్గా ఉన్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. దానికి తాజా ఉదాహరణే మంత్రి ఉష శ్రీచరణ్ వీడియో.

పంపకాలపై రివ్యూ..

సహజంగా మంత్రి కార్యాలయాల్లో ఎన్నికల ప్రచారంపై రివ్యూ జరుగుతుంది. కానీ ఇక్కడ నేరుగా పంపకాలపైనే బహిరంగ సమీక్ష పెట్టినట్టున్నారు మంత్రి. ఆ వ్యవహారం బయటపడింది. పైగా వీడియో సాక్ష్యం, ఆడియో కూడా స్పష్టంగా ఉండటంతో మంత్రి ఇరుకున పడ్డారు. ఓటర్ల జాబితా దగ్గర పెట్టుకున్న మంత్రి, ఓటర్లకు డబ్బులు పంచినట్టు రాసి ఉందని, అయితే ఆ డబ్బుని ఎవరు పంచిపెట్టారు, అసలు ఓటర్లకు ఆ డబ్బు అందిందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలని నాయకులకు సూచిస్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. మంత్రి ముందు కొంతమంది సచివాలయ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. కల్యాణ దుర్గంలోని మంత్రి కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మంత్రి ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారు. బీజేపీ, వామపక్షాల నేతలు మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశారు. గవర్నర్ కి సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేశారు. స్థానిక అధికారులకు టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు.

మార్ఫింగ్ ముద్ర వేస్తారా..?

గతంలో కొంతమంది మంత్రుల ఆడియో క్లిప్ లు బయటపడినప్పుడు సింపుల్ గా మార్ఫింగ్, మా గొంతుని ఎవరో అనుకరించారు, మా పరువు తీయాలని చూశారు అని చెప్పేశారు. ప్రస్తుతం ఉష శ్రీచరణ్ కి సంబంధించిన వీడియో విత్ ఆడియో ఉండటంతో వెంటనే ఎవరూ స్పందించలేదు. అయితే దీనిపై కూడా మార్ఫింగ్ ముద్ర వేస్తారని తేలిపోయింది. అది నిజమే, డబ్బుల పంపిణీ సక్రమంగా జరిగిందో లేదో క్రాస్ చెక్ చేయాలని నేనే చెప్పాను అంటూ మంత్రి ఉష శ్రీచరణ్ ఒప్పుకుంటారని అనుకోలేం. ఒప్పుకోలేరు కాబట్టి ఆ వీడియోపై ఫేక్ అనే ముద్ర బలంగా వేస్తారు. ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతారు.

First Published:  12 March 2023 11:44 PM GMT
Next Story