కళ్లుండీ చూడలేని కబోదిలా ప్రతిపక్షాలున్నాయ్
వివిధ నియోజకవర్గాల్లో సీట్ల మార్పులు చేర్పుల విషయంలో ఒకటికి రెండుసార్లు మాట్లాడిన తర్వాతనే సీఎం జగన్ సర్దుబాటు చేస్తున్నారని మంత్రి రోజా వివరించారు.
ఏపీలో ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా తీరుపై మంత్రి రోజా మండిపడ్డారు. కళ్లు ఉండి కూడా చూడలేని కబోదిలా ఏపీలో ప్రతిపక్షాలు తయారయ్యాయని ఆమె ఎద్దేవా చేశారు. ఇక ఎల్లో మీడియా ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేక విషపు రాతలు రాస్తోందని మండిపడ్డారు. తిరుపతిలో మంత్రి రోజా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేసినప్పుడు ఎన్నికల్లో గెలుపు తప్పకుండా వస్తుందని చెప్పారు. ప్రజల మన్ననలు పొందితే సీట్లు అవే వస్తాయని తెలిపారు. వైసీపీలో సీట్ల కేటాయింపుపై ఎల్లో మీడియా అత్యుత్సాహం చూపిస్తోందని విమర్శించారు.
వివిధ నియోజకవర్గాల్లో సీట్ల మార్పులు చేర్పుల విషయంలో ఒకటికి రెండుసార్లు మాట్లాడిన తర్వాతనే సీఎం జగన్ సర్దుబాటు చేస్తున్నారని మంత్రి రోజా వివరించారు. అయినా ఎల్లో మీడియా మాత్రం కడుపు మంటతో విషపు రాతలు రాస్తోందని మండిపడ్డారు. జనసేన – టీడీపీలకు అసలు మేనిఫెస్టోనే లేదని, సీట్ల సర్దుబాటు లేదని, కానీ వాళ్లు వైసీపీ గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం వైఎస్ జగన్ తండ్రిని మించిన తనయుడిలా ప్రజల కోసం పనిచేస్తున్నారని రోజా చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారని తెలిపారు. ఇప్పటికే 3,257 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారని వివరించారు. ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడం ద్వారా పేదలకు ఎంతో మేలు చేశారని, ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మార్చారని తెలిపారు.