ఆయన వల్లే కాపులకు అన్యాయం.. అందుకే రెండు చోట్లా ఓడించారు..
రాజమండ్రి వైసీపీ కాపు మీటింగ్, విశాఖ గర్జన కంటే మరింత పెద్ద గొడవకు దారి తీసేలా కనిపిస్తోంది. మీటింగ్ కి రెండు రోజు ముందునుంచే మాటల తూటాలు పేలుతున్నాయి.
2024 ఎన్నికల్లో కాపుల ఓట్ల విషయంలో ఏపీలో పెద్ద రచ్చ జరిగేలా ఉంది. కాపు ఓట్లకోసం పవన్ కల్యాణ్ సీరియస్ గా ప్రయత్నిస్తుంటే, వైసీపీలో ఉన్న కాపు నేతలంతా తమ సామాజిక వర్గం ఓట్లన్నీ తమ పార్టీకే పడాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో అసలు కాపులకు న్యాయం చేసింది ఎవరు..? అన్యాయం జరిగింది ఎవరి వల్ల..? అనే చర్చ మొదలైంది. రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల సమావేశం సందర్భంగా రెండు రోజుల ముందుగానే జగన్ టీమ్ నుంచి పవన్ పై మాటల దాడి మొదలైంది. ఈనెల 31న ఇది తారాస్థాయికి చేరుకుంటుందనే అంచనాలున్నాయి.
కాపులకు ఏం ఒరిగింది.. ?
పవన్ కల్యాణ్ వల్ల కాపులకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. పవన్ చర్యలతోనే కాపు సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారని, టీడీపీని బతికించేందుకే పవన్ పని చేస్తున్నారని, దీనివల్ల కాపులకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. కమ్మ పార్టీకోసం పనిచేస్తున్న కాపు నేత పవన్ కి కాపు సామాజిక వర్గం ఎప్పటికీ దగ్గర కాదన్నారు.
రెండు చోట్లా ఎందుకు ఓడిపోయారు.. ?
కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. దీన్నిబట్టి పవన్ కు కాపుల మద్దతు ఏ మేరకు ఉందో అర్థమైపోతోందని చెప్పారు. తమ సామాజిక వర్గమంతా సీఎం జగన్ తోనే ఉందని చెప్పారు. రాజమండ్రి మీటింగ్ లో ఈ వ్యవహారంపై మరింత లోతుగా చర్చిస్తామని చెప్పారాయన. వైసీపీ కాపు నేతలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని.. ఆయనకు సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. మొత్తమ్మీద రాజమండ్రి మీటింగ్, విశాఖ గర్జన కంటే మరింత పెద్ద గొడవకు దారి తీసేలా కనిపిస్తోంది. మీటింగ్ కి రెండు రోజు ముందునుంచే మాటల తూటాలు పేలుతున్నాయి. దీనిపై జనసేన వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.