పవన్ ఇంటి వద్ద రెక్కీ.. వారి పనే..!
వృద్ధ నారీ పతివ్రత లాగా చంద్రబాబు వృద్ధ నారా పతివ్రత అంటూ ఘాటుగా స్పందించారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబుకి విలువలు, విశ్వసనీయత ఏవీ లేవన్నారు.
హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని, ఆయనకు ప్రాణ హాని ఉందని, ఆయనకు భద్రత పెంచాలని జనసేన, బీజేపీ, చివరకు టీడీపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. పవన్ కి భద్రత అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మంత్రి జోగి రమేష్ తనదైన శైలిలో చెణుకులు విసిరారు. అసలు పవన్ ని టార్గెట్ చేయాల్సినంత అవసరం వైసీపీకి ఏముందని ఆయన ప్రశ్నించారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించింది 420 బ్యాచ్ అయి ఉంటుందని, చంద్రబాబే తన మనుషులతో ఇలాంటి నాటకాలు ఆడించి ఉంటారని చెప్పారాయన. ఇలాంటి పనులేవైనా చేసి, తమపై బురద వేయాలనుకుంటున్నారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వారిలాగా కుట్రలు పన్నే అవసరం తమకు లేదన్నారు. దీనిపై తెలంగాణ పోలీసులు విచారణ జరపాలని కోరారు.
వృద్ధ నారి.. వృద్ధ నారా..
వృద్ధ నారీ పతివ్రత లాగా చంద్రబాబు వృద్ధ నారా పతివ్రత అంటూ ఘాటుగా స్పందించారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబుకి విలువలు, విశ్వసనీయత ఏవీ లేవన్నారు. ఆక్రమణదారుడైన అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేయడం తప్పా అని ప్రశ్నించారు జోగి రమేష్. బీసీ అయినంత మాత్రాన ఆక్రమణలు చేసుకోవచ్చా అని అడిగారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటే కేసు పెట్టకూడదా అని ప్రశ్నించారు. అయ్యన్న పాత్రుడు 420 పని చేస్తే బీసీలకు ఏం సంబంధం అని అన్నారు.
లాగేస్తాను, పీకేస్తాను అంటూ బెదిరిస్తున్న చంద్రబాబు.. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు జోగి రమేష్. టీడీపీ ఎంత లేపినా లేవట్లేదని, చంద్రబాబు బీసీలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారాయన. ఈసారి తండ్రీకొడుకులిద్దరూ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని చెప్పారు. చంద్రబాబు చేయించుకున్న సర్వేలో కూడా ఆయనకు ఓటమి తప్పదని తేలిపోయిందన్నారు. 175 సీట్లలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు జోగి రమేష్.